Pedakurapadu : పెదకూరపాడులో వైసీపీ మూకల అరాచకం.. టీడీపీ కార్యాలయాన్ని తగులబెట్టే యత్నం..!
Pedakurapadu : ఏపీలో వైసీపీ అరాచకం కొనసాగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలపు ఖాయం కావడంతో తట్టుకోలేని వైసీపీ మూకలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారు వైసీపీ గూండాలు. ప్రజల మద్దతు కూడగట్టుకోవడంలో విఫలమైన వైసీపీ అరాచకం చేస్తుండడంతో ప్రజలు వైసీపీని చీదరించుకుంటున్నారు.
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలోని క్రోసూరులోని తెలుగు దేశం పార్టీ కార్యాలయాన్ని తగల బెట్టేందుకు అధికార వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. కార్యాలయం ముందు భాగంలో ఏర్పాటు చేసిన తాటాకు పందిరికి ఆదివారం రాత్రి 11.30గంటల సమయంలో నిప్పు పెట్టారు. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసి పడి పందిరి పూర్తిగా కాలిపోయింది. అయితే ఈ మంటలు కార్యాలయానికి అంటుకునే లోగా ఫైర్ ఇంజిన్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. దీంతో కార్యాలయానికి మంటలు వ్యాపించినా భారీ ప్రమాదం తప్పింది.
శనివారం సాయంత్రం క్రోసూరులో జరిగిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే శంకరరావుపై విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలను ఖండిస్తూ ఎమ్మెల్యే శంకరరావు ఆదివారం చంద్రబాబును విమర్శించారు. ఇక టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ శంకరరావు విమర్శలను ఖండిస్తూ మీడియా సమావేశం పెట్టారు. దీంతో పెదకూరపాడులో ఇరుపక్షాల మధ్య రాజకీయం వేడెక్కింది. భాష్యం వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ కార్యకర్తలు అర్ధరాత్రి వేళ క్రోసూర్ లోని టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించారు. ముందున్న పందిరికి నిప్పంటించారు. దీంతో మంటలు రాజుకుని పందిరి పూర్తిగా తగలబడిపోయింది.
ఇంతలో సమాచారం అందుకున్న భాష్యం ప్రవీణ్, టీడీపీ కార్యకర్తలు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంతలో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో టీడీపీ కార్యాలయానికి పెను ప్రమాదం తప్పింది. వైసీపీ కార్యకర్తల దుర్మార్గాన్ని ఖండిస్తూ క్రోసూరు నాలుగు రోడ్ల కూడలిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ..టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో వైసీపీ మూకలకు నిద్ర కరువైందన్నారు. ఆ అక్కసుతోనే వైసీపీ అభ్యర్థి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుపై ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడడంతోనే వారి ఓటమి ఖాయమైపోయిందన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో అరాచకాన్ని ప్రజలు గమనిస్తున్నారని, వారికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెపుతారన్నారు.
టీడీపీ కార్యకర్తలు తల్చుకుంటే వైసీపీ వారి ఇండ్లను, కార్యాలయాలను ఒక్క నిమిషంలో ధ్వంసం చేస్తారని, కానీ టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అని, తమ అధినేత ఇలాంటి వాటిని ప్రోత్సహించరన్నారు. వైసీపీ ఓటమి ఖరారు కావడంతోనే జీర్ణించుకోలేకనే టీడీపీ కార్యాలయాన్ని తగులబెట్టేందుకు ప్రయత్నించారన్నారు. ఈవిషయమై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తామన్నారు. వైసీపీ మూకలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, వైసీపీ గూండాల దుశ్చర్యకు నిరసనగా నేడు(సోమవారం) పెదకూరపాడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉదయం 9 గంటలకు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భాష్యం ప్రవీణ్ పిలుపునిచ్చారు.