YCP Ministers : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇక టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి జోరు చూపుతున్నది. ఇప్పటికే ఎన్నికల ఫలితాలపై స్పష్టత వచ్చినట్లు ట్రెండ్స్ చూస్తే అర్థమవుతున్నది. లీడ్ లో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూటమి క్లీన్‌స్వీప్ దిశగా ముందుకు సాగుతున్నది. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు వైసీపీ సీనియర్లకు షాక్ ఇస్తున్నారు. వైసీపీకి చెందిన మంత్రులంతా వెనుకబడిపోయారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు.
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మంత్రి రోజా వెనుకబడిపోయారు. తొలి రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఇక విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ అభ్యర్థి సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ సైతం వెనుకంజలో ఉన్నారు. తొలుత మంత్రి లీడ్ లో ఉండగా, ఆ తర్వాత టీడీపీ అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు ముందంజలో ఉన్నారు. ఇక గాజువాక నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ సైతం వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ముందంజలో ఉన్నారు.
వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. పుంగునూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా వెనుబడిపోయారు. పెనుగొండలో మంత్రి ఉషశ్రీ చరణ్, గుంటూరు వెస్ట్‌లో విడదల రజనీ, ఆముదాల వలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం ఆధిక్యం ప్రదర్శించలేపోయారు. అమలాపురంలో వైసీపీ అభ్యర్ధి రాపాక వరప్రసాద్ కూడా వెనుకబడి పోయారు.
కేబినెట్ లో మంత్రులుగా చేసిన వారంతా ఓటమి దిశగా సాగుతుండడంతో వైసీపీల్లో అసహనం మొదలైంది. మంత్రులుగా వీరంతా టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలకే పరిమితమయ్యారే తప్ప అభివృద్ధి లో ఏ మాత్రం ముందుకు సాగలేదు. దీంతో అక్కడి ప్రజలు వీరికి గుణపాఠం చెప్పారనే చర్చ మొదలైంది.