YCP – Congress : వైసీపీ కాంగ్రెస్ లో విలీనం..! డీకేతో జగన్ మంతనాలు..!
YCP – Congress : వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పార్టీ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద అభిమాని ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీని రెండు సార్లు పవర్ లోకి తెచ్చిన నేత. ఆయన మరణం తర్వాత పార్టీ పగ్గాలు తనకే ఇవ్వాలని కోరినా అధిష్టానం మాత్రం ససేమీరా అనడంతో తన తండ్రి పేరు కలిసి వచ్చేలా ‘వైఎస్ఆర్ కాంగ్రెస్’ అని పార్టీకి పేరు పెట్టారు. 2014లో పోటీ చేసి 70 సీట్లను దక్కించుకున్నాడు. 2019లో 151 సీట్లు దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అయితే ఇటీవల 2024లో జరిగిన ఎన్నికల్లో కేవలం 11 సీట్లతో ఓటమి పాలయ్యారు. ఇదంతా తెలిసిన విషయమే కానీ ఆయన మళ్లీ కాంగ్రెస్ గూటికి వెళ్తాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
2024 ఎన్నికలకు ముందు వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని జగన్ కు ఆ పార్టీ పెద్దల నుంచి ప్రతిపాదనలు అందాయి. కానీ భారీ మెజారిటీతో గెలుస్తామని భావించిన ఆయన ససేమీరా అన్నారు. పైగా ఏపీలో కాంగ్రెస్ పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఆయనకు తెలుసు ఈ నేపథ్యంలో కుదరదని చెప్పారు. దీంతో తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ అధ్యక్షురాలి చాన్స్ కొట్టేసింది జగన్ సోదరి షర్మిల. షర్మిల కూడా జగన్ ఓటమికి కారణమని చెప్పవచ్చు.
ఎన్నికల ఫలితాల తర్వాత షర్మిల పార్టీ అధ్యక్షురాలు హోదాలో మీడియా ఎదుటకు వచ్చారు. జగన్ రెడ్డి ఓటమిలో తన పాత్ర ఉందని ఆమె చెప్పుకువచ్చారు. వైసీపీ పిల్ల పార్టీ అని ఎప్పటికైనా తల్లి పార్టీ అయిన కాంగ్రెస్ లో కలవాల్సిందేనని అన్నారు. ఈ దిశగా జగన్ కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల బెంగళూర్ వెళ్లిన జగన్ వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎదుట ప్రతిపాదనలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే తన చెల్లెలు షర్మిలను తప్పించి ఆ హోదా తనకు ఇవ్వాలని కోరినట్లు చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పార్టీలో ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో కొంత మంది కూటమి వైపు చూస్తున్నారని లీకులు వస్తు్న్నాయి. గెలిచిన నలుగురు వైసీపీ ఎంపీలను బీజేపీలోకి కలుపుకునేందుకు విజయసాయిరెడ్డి చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జగన్ ను ఆదుకునేది కాంగ్రెస్ అని అందుకే ఆయన ఈ ఆఫర్ పెట్టారని ఏపీలో చర్చ జరుగుతుంది.