YCP Manifesto : త్వరలోనే వైసీపీ మ్యానిఫెస్టో.. సీనియర్లకు జగన్ పిలుపు
YCP Manifesto : ఎన్నికల మ్యానిఫెస్టో అంటే పార్టీల హామీ పత్రం. ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పే పత్రం అది. ఒకప్పుడు మ్యానిఫెస్టో అమలు అంటే పార్టీలు పెద్దగా పట్టించుకునేవి కావు. కానీ ప్రస్తుతం మ్యానిఫెస్టోలో చెప్పిన అంశాలను అమలు చేయకుంటే ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు నిలదీస్తున్నారు.
రాబోయే నెలన్నర రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయ్. పార్టీలన్నీ మ్యానిఫెస్టో ను తయారు చేసే పనిలో ఉన్నాయి. మ్యానిఫెస్టో తయారు చేయడానికి జగన్ సిద్ధమయ్యారు. మ్యానిఫెస్టోలో ఇచ్చే పలు హామీలపై ఓ అంచనాకు వచ్చేసిన సీఎం జగన్ వాటిని ఖరారు చేసేందుకు నేడు పార్టీ సీనియర్లతో భేటీ కాబోతున్నారు.
పాత పథకాలతో పాటు కొత్త హామీలపై జగన్ దృష్టి సారించారు. ఇందులో కొత్త డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ, పింఛన్ల పెంపు సహ మహిళలకు కొన్ని కొత్త పథకాలు కూడా ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. వీటి వివరాలు బయటకు రాకపోయినా కచ్చితంగా ఈసారి కూడా ప్రజాకర్షక పథకాలతోనే జనంలోకి వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వీటిని ఫైనల్ చేసి త్వరలో మ్యానిఫెస్టో ప్రకటనకు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే మ్యానిఫెస్టో ప్రకటించి జనంలోకి దాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తోంది.