YCP Leaders : ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా రికార్డు విక్టరీ నమోదు చేసింది. దీంతో ప్రస్తుతం పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు విశ్లేషించుకునే పనిలో పార్టీ ఉంది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పార్టీలోనే వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ చెప్పిందే వేదం అన్నట్లు తలాడించిన నేతలు ఇప్పుడు ఆ పార్టీ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్న వేళ భిన్నభిప్రాయాలు వినిపిస్తున్నారు. వైసీపీ ఓటమికి ఈవీఎంలపై జగన్ సందేహాలు వ్యక్తం చేయడాన్ని ఆ పార్టీ నేతలు తప్పుపడుతున్నారు.
టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు ఫలితం ఇలాగే ఉంటుందని వైసీపీ నేతలకు కళ్లు తెరిపించేలా సమాధానం ఇచ్చారు రాపాక వరప్రసాద్. ఈవీఎంలపై వైసీపీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలను తాను ఒప్పుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇటీవలే వైసీపీ ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్ సైతం తమ పార్టీ ఓటమికి కొంతమంది నాయకుల నోటిదురుసు కూడా ఓ కారణమని పరోక్షంగా చెప్పేశారు. జగన్ కలవాలంటే ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో నియోజకవర్గంలోని క్షేత్రస్థాయి సమాచారం జగన్ కు చేరలేదన్నారు. అదే పార్టీకి ఊహించని ఫలితాలు తెచ్చి పెట్టిందని వారు విశ్లేషించారు.
ఇలా ఒక్కొక్కరుగా వైసీపీ నేతలు తమ వాదనను వినిపిస్తూ మంచి చేసి ఓడిపోయామని, ఈవీఎంలే కారణమై ఉండొచ్చునని తమ పార్టీ నాయకుడు జగన్ చెబుతున్న వాదనలను కొట్టి పారేస్తున్నారు. పార్టీ ఓటమిపై జగన్ చేస్తోన్న వ్యాఖ్యలను ఒక్క రోజా తప్ప ఆ పార్టీకి చెందిన మరే నాయకుడు ఒప్పుకోవడం లేదు. పరిస్థితి చూస్తుంటే రానున్న రోజుల్లో జగన్ వ్యతిరేక స్వరాలు మరిన్ని పెరిగే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇన్నాళ్లు జగన్ ఏదంటే అదే అన్న నేతలు కొద్ది రోజులుగా స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఇందుకు ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుపు దోహదం చేయడం విశేషం.