YCP Leaders : టికెట్ రానోళ్లు సరే.. టికెట్ వచ్చినోళ్లు కూడా జంప్.. వైసీపీ దీన పరిస్థితి ఇదీ..

YCP Leaders : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దీనంగా మారిపోయింది. టికెట్లు రాని వారు పార్టీ మారుతున్నారంటే ఓ లెక్క.. కానీ టికెట్ వచ్చిన వారు కూడా మీకో దండం అనే పరిస్థితి వైసీపీలోనే కనపడుతోంది. ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆలూరు ఎమ్మెల్యే గా ఉన్న ఆయనకు కర్నూలు ఎంపీ టికెట్ ను సీఎం జగన్ కేటాయించారు. జడ్పీటీసీగా ఉన్న విరూపాక్షికి ఆలూరు టికెట్ కేటాయించారు. అయితే తాను ఎంపీగా పోటీ చేయబోనని ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నానని జయరాం చెబుతున్నారు.

ఆలూరుకు కొత్త ఇన్ చార్జిని ప్రకటించిన తర్వాత గుమ్మనూరు జయరాం నియోజకవర్గానికి వచ్చారు. కార్యకర్తలతో సమావేశం పెట్టి ఎంపీ టికెట్ జేబులో ఉంది. కానీ ఆలూరును వదిలి వెళ్లే ప్రసక్తి లేదన్నారు. కార్యకర్తలతో సమావేశం తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. కొద్ది రోజులు బెంగళూరులో ఉన్న జయరాం.. ఆ తర్వాత ఆలూరుకు వచ్చినా ఎవర్నీ కలువలేదు. వైసీపీ తాజా అభ్యర్థి విరుపాక్షి కలిసేందుకు ప్రయత్నించినా.. ఆయన అందుబాటులోకి రాలేదు.

ఎంపీగా పోటీ చేసే విషయంపై మాట్లాడేందుకు వైసీపీ ముఖ్య నేతల ప్రయత్నం చేసినా ఆయన ఆసక్తి చూపించడం లేదు. కాంగ్రెస్ లో చేరి అయినా పోటీ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రి నాగేంద్రతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కర్నాటక మంత్రి నాగేంద్ర ఆయనకు సమీప బంధువు. కాంగ్రెస్ లో చేరితే ఆయనకు ఆలూరు టికెట్ కేటాయించడం ఖాయమే.

వైసీపీ పరిస్థితి ఏమీ అంత బాగోలేదని క్లారిటీ రావడంతో గుమ్మనూరు క్యాడర్ ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఒకప్పుడు టీడీపీ నుంచే జడ్పీటీసీగా గెలిచిన గుమ్మనూరు జయరాం తర్వాత పార్టీ మారారు. కానీ ఆయనను మళ్లీ పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ సిద్ధంగా లేదు. అందుకే ఆయన కాంగ్రెస్ లో చేరి తన బలాన్ని నిరూపించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

TAGS