Pawan Kalyan : మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. రాష్ట్రంలో ఎన్నికలు కూడా ఏప్రిల్ నెలలోనే తొలివిడతలో ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ సమయాత్తమయ్యాయి. వైసీపీ పూర్తిగా తన అభ్యర్థులను త్వరగా ప్రకటించాలని భావిస్తోంది. ఇక కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ కూడా అభ్యర్థుల ప్రకటనను ముమ్మరం చేశాయి.
ఇంతా వరకు బాగానే ఉన్నా జనసేనాని ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే విషయం ఇటు రాజకీయ పార్టీలతో పాటు జనాల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొని ఉంది. ఎంపీగా పోటీ చేస్తారా? ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? అని అందరూ పవన్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. జగన్ పులివెందులలో, చంద్రబాబు కుప్పంలో, లోకేశ్ మంగళగిరిలో, బాలయ్య హిందూపురంలో.. ఇలా ప్రధాన నేతల నియోజకవర్గాలు ఫిక్స్ అయ్యాయి. కానీ పవన్ తన నియోజకవర్గాన్ని ప్రకటించకపోవడంపై సర్వత్రా ఉత్కంఠ పెరిగిపోతోంది. ప్రత్యర్థి పార్టీ వైసీపీలో అయితే మరీనూ..
పవన్ పార్టీ పెట్టి పదేళ్లు అవుతోంది. 2014లో పోటీ చేయలేదు. 2019లో ఒక్క సీటు మాత్రమే గెల్చుకున్నారు. ఈ ఎన్నికల్లోనే పవన్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. ప్రస్తుత 2024 ఎన్నికలు జనసేన, పవన్ భవిష్యత్ ను డిసైడ్ చేయబోతున్నాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని, జగన్ గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో పవన్ టీడీపీ, బీజేపీలను ఒప్పించి మరీ కూటమి ఏర్పాటుకు కారణమయ్యారనే చెప్పవచ్చు. ఈ విషయంలో పవన్ సక్సెస్ అయ్యాడు. దీంతో అధికార వైసీపీ పవన్ ను దెబ్బతీయాలనే యోచనలో ఉంది.
పవన్ ను రాజకీయంగా దెబ్బతీయాలంటే ఆయన్ను గెలవకుండా చేయడం..జనసేనకు తక్కువ సీట్లు వచ్చేలా చూడడంపై గురిపెట్టింది. ఈ ఎన్నికల్లో జనసేనను తద్వారా కూటమిని దెబ్బతీస్తే భవిష్యత్ రాజకీయాల్లో పవన్ ..జగన్ కు అడ్డురాకుండా ఉంటాడు. అలాగే జనసేన రూపంలో తనకు బలమైన ప్రత్యర్థి తయారవుతుంది. కాబట్టి పవన్ ను ఓడించడం వైసీపీ అత్యంత రాజకీయ అవసరం. అందుకే పవన్ పోటీపై వైసీపీ శ్రేణులు సెటైర్స్, ట్రోలింగ్స్ తో జనసైనికులు, పవన్ కల్యాణ్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నాయి. అలాగే వైసీపీ హైకమాండ్ కూడా పవన్ పోటీ చేసే నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఎన్ని వేల కోట్లయినా ఖర్చు చేసి పవన్ ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తుందని గ్యారెంటీగా చెప్పవచ్చు.