Pawan Kalyan : వైసీపీ ప్రభుత్వం యువతను గంజాయి మత్తుకు బానిస చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఏలూరు జిల్లా కైకలూరులో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. భవన నిర్మాణ కార్మికుల కోసం గళమెత్తిన పార్టీ జనసేన అని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఠా కూలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు భయపడకుండా బతకాలన్నదే తన కోరిక అని, సమస్యల పరిష్కార బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.
‘‘వైసీపీ పాలనలో 112 మంది జర్నలిస్టులపై దాడులు జరిగాయి. పత్రికలు, ఛానళ్లను కట్టడి చేసేందుకు జీవో నెం.1 తెచ్చారు. భూములు దోచేసే చట్టాన్ని అసెంబ్లీలో చర్చ లేకుండానే తెచ్చారు. మన ఆస్తి మనదని 90 రోజుల్లో నిరూపించుకోలేకపోతే దోచుకుంటారా..? అని పవన్ ప్రశ్నించారు.