flood relief : వరద సాయం పంపిణీపై వైసీపీ తప్పుడు ప్రచారం: టీడీపీ ఎమ్మెల్యేలు
flood relief : వరద నష్ట పరిహారం పంపిణీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు చూస్తున్నారని వారు మండిపడ్డారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, వసంత కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, బోడె ప్రసాద్ పాల్గొన్నారు. వరదలు వచ్చిన 15-20 రోజుల్లోనే బాధితులకు ప్రభుత్వం పరిహారం పంపిణీ చేసిందని గద్దె రామ్మోహన్ అన్నారు. 98 శాతం మందికి సాయం అందిందని, సాంకేతిక కారణాలతో 2 శాతం మందికి అందలేదని చెప్పారు. త్వరలోనే వారికి పరిహారం అందిస్తామన్నారు.
వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, ప్రజలకు వాస్తవాలు తెలియాలని వసంత కృష్ణప్రసాద్ అన్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రైతులకు హెక్టారుకు రూ.25 వేలు చొప్పున సీఎం చంద్రబాబు పరహారం అందజేశారని చెప్పారు. ముంపునకు గురైన ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ కి రూ.25 వేలు, ఫస్ట్ ఫ్లోర్ కి రూ.10 వేల సాయం ఇచ్చారని తెలిపారు. సీఎం 11 రోజుల పాటు బస్సులోనే ఉంటూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రజలను ఆదుకున్నారన్నారు.