Janasena Vs YCP : ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న రాజకీయం రసవత్తరంగా మారుతోంది. బండబూతులు, ట్రోలింగ్ లే కాదు తన్నుకునే దాక వచ్చింది వ్యవహారం. ఏప్రిల్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో నేతలంతా బిజీబిజీ అయిపోయారు. ఇక చిన్నపాటి నేతలంతా టీవీ డిబేట్లు, సోషల్ మీడియా ప్రమోషన్లలో తలమునకలయ్యారు.
ఒక్కోసారి ఈ నేతల ప్రవర్తన హద్దులు మీరుతోంది. నిన్న ఇద్దరు నేతలు చేసిన పని ఏపీ రాజకీయాలు ఎంత భ్రష్టు పట్టాయో తెలుపుతోంది. సోషల్ మీడియాలో కారాలు, మిరియాలు రువ్వుకుంటున్న నేతలు ఓ చర్చావేదికలో తన్నుకున్నారు. ఓ యూట్యూబ్ చానల్ లో చర్చావేదికలో వైసీపీ, జనసేన మద్దతు దారులు చింతా రాజశేఖర్, విష్ణు నాగిరెడ్డి తో పాటు కొట్టుకున్నారు. మొదటగా మాటల యుద్ధంతో మొదలైంది. ఆ తర్వాత మాటమాట పెరిగి బండ బూతులు తిట్టుకుంటూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చివరికి స్టూడియో సిబ్బంది ఇద్దరినీ నిలువరించారు.
ఈ ఘటన ఏపీ తీవ్ర చర్చనీయాంశమైంది. ఏదైనా ఉంటే విధానాల పరంగా సభ్యతగా మాట్లాడుకోవాలి గానీ ఇలా వీధి రౌడిల్లా టీవీ డిబేట్ లో కొట్టుకోవడమేంటి అని జనాలు మండిపడుతున్నారు. అసలు ఇలాంటి వారికి రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా అని ప్రశ్నించారు. ఇలాంటి నేతలకు ఎన్నికల్లోనే బుద్ధి చెప్తామని అంటున్నారు.