YCP 9th List : ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న పార్టీలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటనను పూర్తి చేసుకుని ప్రచార బరిలో దిగేందుకు తహతహలాడుతున్నాయి. అభ్యర్థుల ప్రకటనలో వైసీపీ ముందంజలో ఉంది. ఇప్పటికే 8 జాబితాలను ప్రకటించిన ఆ పార్టీ శుక్రవారం సాయంత్రం తన తొమ్మిదో జాబితాను ప్రకటించింది. మొత్తం మూడు స్థానాలకు ఇన్ చార్జిలను నియమించింది.
నెల్లూరు పార్లమెంటరీ స్థానం సమన్వయకర్తగా విజయసాయిరెడ్డిని నియమించింది. అలాగే కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఇంతియాజ్(రిటైర్డ్ ఐఏఎస్), మంగళగిరి వైసీపీ ఇన్ చార్జిగా మురుగుడు లావణ్యను నియమించింది. మంగళగిరికి గతంలో గంజి చిరంజీవిని సమన్వయకర్తగా నియమించగా.. ఇప్పుడు ఆ స్థానంలో మార్పు చేసింది. ఇంతియాజ్ ఈ మధ్యనే తన ఉద్యోగానికి వీఆర్ఎస్ తీసుకుని వైసీపీలో చేరారు.
తాజాగా మంగళగిరిలో జరిగిన వైసీపీ కీలక సమావేశంలో పార్టీ అధినేత, సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎన్నికల కోసం పార్టీ తరుఫున ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని.. ఒకటి రెండు మార్పులు తప్పించి ఇప్పటిదాకా ప్రకటించిన ఇన్ చార్జులకే టికెట్లు దాదాపు ఖాయమని ప్రకటించారు. కాగా, ఇప్పటివరకు విడుదలైన 9 జాబితాల వారీగా చూస్తే.. 74 అసెంబ్లీ స్థానాలకు, 21 పార్లమెంట్ స్థానాలకు ఇన్ చార్జులను ప్రకటించింది.