Yatra-2 Collections : సీఎం జగన్ బయోపిక్ ని ఆధారంగా తీసుకొని డైరెక్టర్ మహి వి రాఘవ్ తెరకెక్కించిన ‘యాత్ర 2 ‘ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. యాత్ర కి కొనసాగింపుగా తెరకెక్కిన ఈ సినిమాలో సీఎం జగన్ గురించి ఎంతో గొప్పగా చూపించాడు. అదే సమయం లో ప్రతిపక్ష పార్టీలను తీవ్రంగా విమర్శించకుండా, కేవలం జగన్ ఇమేజిని ఎలివేట్ చేస్తూ ఈ చిత్రాన్ని మహి వి రాఘవ్ తెరకెక్కించిన తీరుకి మంచి మార్కులు పడ్డాయి.
కేవలం సీఎం జగన్ అభిమానులు మాత్రమే కాకుండా, సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమాని చూసి పొగడ్తలతో ముంచి ఎత్తారు. కానీ కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. గతం లో సీఎం జగన్ తండ్రి, దివంగత ముఖ్య మంత్రి రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాకి అప్పట్లోనే మొదటి రోజు మూడు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ యాత్ర 2 చిత్రానికి అందులో సగం కూడా రాకపోవడం విశేషం. దాదాపుగా అన్నీ ప్రాంతాలలో కూడా ఈ సినిమాకి టిక్కెట్లు వైసీపీ పార్టీ వారే కొనుగోలు చేసి ఉచితంగా ప్రేక్షకులను థియేటర్స్ కి తీసుకొచ్చారు. అందుకే ఆ మాత్రమైనా వసూళ్లు కనిపిస్తున్నాయని, లేకపోతే అసలు అది కూడా వచ్చేది కాదని అంటున్నారు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు కేవలం కోటి 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. బుక్ మై షో టికెట్ సేల్స్ యాప్ లో మొదటి రోజు ఈ చిత్రానికి కేవలం 20 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయట. మొన్న విడుదలైన పవన్ కళ్యాణ్ పాత సినిమా ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ చిత్రానికి ఇంతకు మించిన టిక్కెట్లు అమ్ముడుపోయాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.
సినిమాని నిర్మించడానికి దాదాపుగా 5 కోట్ల రూపాయిల ఖర్చు అయ్యింది. సీఎం జగన్ కి ఉన్న ఇమేజి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 12 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని చూస్తూ ఉంటే కనీసం మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా వచ్చేలా కనిపించడం లేదు. కమర్షియల్ గా యాత్ర 2 చిత్రం పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యేలా కనిపిస్తుంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు.