Yadadri laddu : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అందించే ప్రసాదంలో వినియోగించే నెయ్యి స్వచ్ఛంగా ఉందని రాష్ట్ర ఆహార ప్రయోగశాల నిర్ధారించినట్లు ఈవో భాస్కర్ రావు తెలిపారు. నిన్న (బుధవారం) ఆయన యాదగిరిగుట్ట కొండపైన మీడియాతో మాట్లాడారు. గత నెల 21న నెయ్యి నమూనాలను సేకరించి పరీక్షించి కల్తీ లేదని తేల్చినట్టు పేర్కొన్నారు. తేమ, ఓలేయిక్ యాసిడ్ వంటి కొవ్వు ఆమ్లాలు పరిమితంగా ఉన్నట్టు గుర్తించారని చెప్పారు. యాదగిరిగుట్ట ప్రసాదాలతో పాటు స్వామివారి కైంకర్యాలకు 40 ఏండ్ల నుంచి మదర్ డెయిరీ తయారు చేసిన నెయ్యినే వినియోగిస్తున్నట్లు ఈవో తెలిపారు.
కిలో రూ.609కి కొనుగోలు చేస్తున్న నెయ్యి నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉన్నట్లు వివరించారు. రోజుకు వెయ్యి కిలోల నెయ్యి వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. విజయ డెయిరీ నెయ్యి వాడాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలిచ్చిందని, అయితే ప్రస్తుతం పాత టెండర్ కొనసాగుతున్నందున వచ్చే మార్చి నెలాఖరు వరకు మదర్ డెయిరీ నెయ్యినే వినియోగించనున్నట్లు తెలిపారు.