PM Modi : ఏపీలో ఎటుచూసినా ఎన్నికల హడావిడే కనిపిస్తోంది. షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీ తమ అస్త్రశస్త్రాలను బయటకు తీస్తున్నాయి. జగన్ ఓటమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి దూకుడుగా పనిచేస్తోంది. ఓ వైపు కాంగ్రెస్, వామపక్షాలు బరిలోకి దిగుతుండగా..జగన్ ఒంటరిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమిలో జోష్ పెంచేందుకు ప్రధాని మోదీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో మోదీ ప్రసంగం రాజకీయంగా అనేక సందేహాలకు దారితీసినట్టు కనిపిస్తోంది. చంద్రబాబు, పవన్ వ్యూహాలకు భిన్నంగా మోదీ ప్రసంగం సాగింది.
మోదీ తన ప్రసంగంలో ఎక్కడా చంద్రబాబు నాయకత్వం ఏపీకి అవసరమని చెప్పలేదు. ఇదే విషయం ఇప్పుడు టీడీపీ క్యాడర్ కు నచ్చడం లేదు. ఒక్క సందర్భంలో మినహా చంద్రబాబు, పవన్ ప్రస్తావన తేలేదు. అసలు టీడీపీ, జనసేన పేర్లు ప్రధాని నోట వినిపించలేదు. జగన్ ను టార్గెట్ చేస్తున్నట్లు కనిపించలేదు. ఏపీకి సంబంధించి ఏ అంశంపైన హామీ ఇవ్వలేదు. అమరావతి ప్రస్తావన ఎత్తలేదు. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ ఊసే తీయలేదు. కానీ ఏపీలో వైసీపీ, కాంగ్రెస్ ఒక్కటేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీలు కలిసి ఓట్లను చీల్చేందుకు వేర్వేరుగా ఉన్నట్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. రెండు పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ఓట్లు చీలకుండా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే శరవేగంగా అభివృద్ధి చేస్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నీలి విప్లవం తీసుకొస్తామన్నారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ వస్తేనే వికసిత భారత్ తో పాటు, వికసిత ఆంధ్రప్రదేశ్ సైతం సాధ్యమవుతుందని మోదీ స్పష్టం చేశారు.
ఇక షర్మిల తన అన్న జగన్ తో విభేదించిన సమయం నుంచి చంద్రబాబు ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ వివేకా హత్య కేసులో పోరాటం చేస్తున్న సునీతకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. సొంత చెల్లినే జగన్ పట్టించుకోవడం లేదని చంద్రబాబు, పవన్ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. షర్మిల విమర్శలను ప్రతీ సందర్భంలోనూ ప్రస్తావిస్తూ జగన్ ను ఇరకాటంలోకి నెట్టేలా వ్యవహరిస్తున్నారు.
అయితే మోదీ ప్రసంగం చంద్రబాబు, పవన్ ఆలోచనలకు భిన్నంగా ఉండడంతో ఒక్కసారిగా వారి వ్యూహం కొత్త టర్న్ తీసుకుంది. ఈ అంశంలో మోదీ, చంద్రబాబు, పవన్ మధ్య సమన్వయం కొరవడినట్టు తెలుస్తోంది. చంద్రబాబు, పవన్ తమ ఎన్నికల ప్రచార సభల్లో వివేకా హత్య అంశాన్ని ప్రస్తావన చేస్తున్నారు. మోదీ చేసిన వ్యాఖ్యలతో ఇక నుంచి షర్మిలను సమర్థిస్తూ చంద్రబాబు, పవన్ మాట్లాడే అవకాశం ఉండదని భావిస్తున్నారు. ఇదే సమయంలో ఇప్పటివరకు చంద్రబాబు చేసిన ఆరోపణలకు విలువ లేకుండా పోతోందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఒక విధంగా షర్మిలను వాడుకోకపోవడం ద్వారా జగన్ పై ఒక అస్త్రం మిస్ అయినట్టు కనపడుతోంది.