World Cup Final Guest : ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్ రేపు జరగబోతున్నది. గుజరాత్ రాష్ర్టంలోని అహ్మదాబాద్ లో నరేంద్రమోదీ స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్ టీమిండియా, ఆస్ర్టేలియా జట్ల మధ్య జరగబోతున్నది. ఈ మ్యాచ్ కు ఐసీసీ తో కలిసి బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేసింది. పెద్ద సంఖ్యలో అభిమానులు ఈ మ్యాచ్ తిలకించేందుకు రాబోతున్నారు. ఇప్పటికే అహ్మదాబాద్ లోని స్టేడియం పరిసరాల హోటళ్లన్నీ నిండుకున్నాయి. ఇక వీవీఐపీలు కూడా ఈ మ్యాచ్ తిలకించేందుకు ఇప్పటికే అహ్మదాబాద్ కు చేరుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ మ్యాచ్ తిలకించేందుకు ఇద్దరు కీలక అతిథులు వస్తున్నట్లు తెలుస్తున్నది.
అయితే ఈ ఫైనల్ మ్యాచ్ ను తిలకించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నట్లు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ధ్రువీకరించారు. ఆయన తో పాటు ఆస్ర్టేలియా ఉప ప్రధాని, కేంద్ర మంత్రులు , ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు వస్తున్నట్లు గుజరాత్ సీఎం ట్వీట్ చేశారు. అయితే అతిథుల కోసం ప్రత్యే క ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు భారీ భద్రతా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
అయితే పది వరుస విజయాల తర్వాత టీమిండియా ఆస్ర్టేలియాను ఫైనల్ లో ఢీకొనబోతున్నది. ఇప్పటికే లీగ్ దశలో రోహిత్ సేన చేతిలో ఆస్ర్టేలియా ఓడిపోయింది. 1983, 2011 తర్వాత భారత్ కు మూడోసారి ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉంది. టీమిండియా దాదాపు 12 ఏండ్ల తర్వాత వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకుంది. ఏదేమైనా టీమిండియా గెలవాలని భారత క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.