World Cup 2023 Semis In Wankhede Stadium : వన్డే వరల్డ్ కప్ 2023 తుది దశకు చేరుకుంది. రేపు జరిగే సెమీఫైనల్ 1 కోసం భారత అభిమానులంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక లీగ్లో ఓటమే లేకుండా టీమిండియా టాప్ 1 లో నిలిచింది. ఇక కివీస్ ను ఈ సెమీస్ లో ఢీకొనబోతున్నది. అయితే ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుండడంతో ఇప్పుడు భారత అభిమానుల్లో పెద్ద టెన్షన్ నెలకొంది. ఎందుకంటే గత రికార్డులన్నీ భారత కు ప్రతికూలంగా ఉండడమే కారణం. అదే సమయంలో నాటి ధోనిసేన 2011లో ప్రపంచ కప్ గెలుచుకున్న గ్రౌండ్ కూడా ఇదే కావడం గమనార్హం.
ఇక బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీఫైనల్ 1, ఇక కొల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో దక్షిణాఫ్రికా, ఆస్ర్టేలియా జట్ల మధ్య సెమీఫైనల్ 2 జరగనుంది. అయితే ఇప్పుడు వాంఖడేలో ఉన్న గత రికార్డులు అభిమానుల ఆందోళనకు కారణమవుతున్నది. ముందుగా 1987లో జరిగిన ప్రపంచకప్ లో ఇదే స్టేడియంలో భారత్ ఓడిపోయింది. ఇంగ్లాండ్ పై ఓటమి చవిచూసింది.
ఆ తర్వాత కూడా నెహ్రూ కప్ సెమీ ఫైనల్లో టీమిండియా వెస్టిండీస్ పై ఓటమిపాలైంది. 2016 లో టీ 20 ప్రపంచకప్ లో ఇదే జట్టుపై భారత్ మరో ఓటమి మూటగట్టుకుంది. 2019 ప్రపంచకప్ సెమీస్ లో న్యూజిలాండ్ భారత జట్టుపై విజయం సాధించింది. అయితే ఈ స్టేడియంలో కాకున్నా కివీస్ జట్టు చేతిలో గతంలో జరిగిన పరాభావం కూడా భారత అభిమానుల్లో ఆందోళనకు కారణమవుతున్నది.
అయితే ఇదే వాంఖడే స్టేడియంలో 2011 ప్రపంచకప్ ను భారత్ అందుకున్నది. 2019లో న్యూజిలాండ్ పై సెమీస్ లో ఓటమికి బదులు తీర్చుకోవడానికి మళ్లీ ఇదే స్టేడియం ఉపయోగపడుతుందని భారత అభిమానులు ఆశిస్తున్నారు. మరి రేపటి మ్యాచ్ భారత అభిమానుల్లో మాత్రం ఉత్కంఠ పెంచుతున్నది.