Hyderabad News : కొందరిని చూస్తే అమాయకంగా కనిపిస్తారు. వారి చిన్న చిన్న బిజినెస్ లు చూస్తే పాపం ఎలా బతుకుతారో కదా అనిపిస్తుంది. కానీ వాళ్ల అసలు బిజినెస్ లు చూస్తే కళ్లుచెదిరిపోతాయి. వాళ్ల సంపాదన చూస్తే షాక్ అవ్వాల్సిందే. తాజాగా ఓ మహిళ బిజినెస్ చూస్తే అదే అనిపిస్తుంది. బయట నుంచి చూస్తే ఓ చిన్న సాదాసీదా కిరాణం షాపు నడుపుకునే మహిళ. కానీ ఆమె బ్యాంకు బ్యాలెన్స్, కోట్ల రూపాయల విలువ చేసే స్థిరాస్తులు చూస్తే వామ్మో అని నోరెళ్లబెట్టక మానరు.
హైదరాబాద్ నానక్ రాం గూడలో కిరాణం షాపు నిర్వహించే ఓ మహిళ బ్యాంకు ఖాతాల్లో రూ.1.63 కోట్ల నగదు, హైదరాబాద్ వేర్వేరు ప్రాంతాల్లో రూ.2 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఆ కిరాణ షాపు ఓనర్ నీతూబాయి కుటుంబం దుకాణం నడుపుతూనే గంజాయి విక్రయాలు చేస్తోంది. ఎనిమిదేళ్లలో కోట్లు సంపాదించినట్టు టీఎస్ న్యాబ్ పోలీసులు గుర్తించారు. బుధవారం ‘డెకాయి ఆపరేషన్’ లో నీతూబాయి, ఆమె భర్త మున్ను సింగ్(53), సమీప బంధువులు సురేఖ(38), మమత(50)తో పాటు 13 మంది గంజాయి వినియోగదారులు వెరసి మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు.
ధూల్ పేటకు చెందిన గౌతమ్ సింగ్, నేహా బాయి పరారీలో ఉన్నారు. అరెస్టయిన వారి నుంచి 22.6 కిలోల గంజాయి, 2 ఫోన్లు, రూ.22.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య గురువారం ఒక ప్రకటనలో చెప్పారు.
నీతూబాయి, మున్నుసింగ్ , ఇతర కుటుంబ సభ్యులు తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు గంజాయి విక్రయాలు మొదలుపెట్టారు. ధూల్ పేటకు చెందిన అంగూరిబాయి నుంచి కిలో గంజాయి రూ.8వేల చొప్పున కొని 5 గ్రాముల చొప్పున చిన్న పొట్లాల్లో నింపి రూ.500లకు అమ్మేవారు. అలా కిలో గంజాయి విక్రయాలతో రూ.50 వేల దాక సంపాదించేవారు. ఆ డబ్బుతో అంతా విలాసవంత జీవితం గడిపేవారు. ఖరీదైన ప్రాంతాల్లో ఇళ్లు, స్థిర, చరాస్తులు కొన్నారు. గతేడాది ఆగస్టులో నీతూబాయి కుటుంబ నేపథ్యాన్ని పోలీసులు ఆరా తీశారు. దీంతో రూ.4 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.