Thomas Edison Mother : ఆ మాతృమూర్తే లేకుంటే మనకు వెలుగే లేదు..నేటి తల్లులకు ఆదర్శం ఆమే..
Thomas Edison Mother : ప్రస్తుతం మన అత్యంత సాంకేతికత మధ్య జీవనం సాగిస్తున్నాయి. సృష్టికి ప్రతిసృష్టి చేసే కాలంలో ఉన్నాం. భూమండలంపైనే కాదు అంతరిక్షంపై ఆధిపత్యం మనదే. మానవ సమాజ ఉన్నతి కరెంట్ బల్బు తయారీతో ప్రారంభమైందని చెప్పవచ్చు. కోట్ల సంవత్సరాల అభివృద్ధి బల్బ్ కనిపెట్టిన శతాబ్ద కాలంలోనే జరిగిందనడంలో సందేహం లేదు. బల్బ్ ను కనిపెట్టి మనిషి మనుగడను మరింత ఉన్నతంగా తీర్చిన ఘనత థామస్ అల్వా ఎడిసన్ ది. ఆయన ఒక్క బల్బే కాదు.. మనం ఇప్పుడు వినియోగిస్తున్న ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలు ఆయన కనిపెట్టినవే. మనం ఇప్పుడు ఇంతగా పురోగమించామంటే అది ఎడిసన్ ఆలోచనల చలువే.
దీని బట్టి ఎడిసన్ ఎంత మేధావో మనకు తెలుస్తుంది. అయితే ఆయనను మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దింది ఆయన తల్లే అని గర్వంగా చెప్పవచ్చు. బిడ్డ మనసు, మేథస్సు తల్లికంటే ఎవరికీ ఎక్కువగా తెలుసు? థామస్ అల్వా ఎడిసన్ ను గొప్ప సైంటిస్ట్ గా నిలబెట్టడంలో ఆమెదే ప్రథమ స్థానం. ఎడిసన్ ను తీర్చిదిద్దడంతో ఆమె చేసిన కృషి ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం..
ఒకరోజు థామస్ ఎడిసన్ ఇంటికి వచ్చి తన తల్లికి ఒక కాగితం ఇచ్చాడు. అతను ఆమెతో.. ” అమ్మా మా టీచర్ ఈ కాగితాన్ని నాకు ఇచ్చాడు.. అది ఎవరూ చదవకూడదు మరియు అది నీకు మాత్రమే ఇవ్వమని చెప్పాడు”. ఆమె తన కుమారుడికి లేఖను బిగ్గరగా చదివినప్పుడు అతడి తల్లి కళ్లు చెమర్చాయి. ఆమె లేఖను ఇలా చదివింది.. “మీ బిడ్డ మేధావి. ఈ పాఠశాల అతడికి చాలా చిన్నది మరియు అతడికి శిక్షణ ఇవ్వడానికి తగినంత మంచి ఉపాధ్యాయులు లేరు. దయచేసి అతనికి మీరే నేర్పండి’’.
ఎడిసన్ తల్లి మరణించిన చాలా సంవత్సరాల తర్వాత అతను శతాబ్దపు గొప్ప ఆవిష్కర్తలలో ఒకడుగా ఉన్నాడు. ఒక రోజు అతను పాత కుటుంబ సామాన్లు చూస్తున్నాడు. అకస్మాత్తుగా అతను డెస్క్‌లో డ్రాయర్ మూలలో ముడుచుకున్న కాగితాన్ని చూశాడు. అతను దానిని తీసుకొని తెరిచాడు. అది అతడి చిన్నప్పుడు స్కూల్ లో టీచర్ ఇచ్చిన కాగితం. కాగితంపై ఇలా రాసి ఉంది: ‘‘మీ కొడుకుకు addled జబ్బు (మానసిక అనారోగ్యం). మేము ఇక అతన్ని పాఠశాలకు రానివ్వము’’
ఎడిసన్ గంటల తరబడి ఏడుస్తూ తన డైరీలో ఇలా రాసుకున్నాడు: “థామస్ ఆల్వా అడిసన్ ఒక మానసిక వికలాంగుడైన బిడ్డ, కానీ తల్లి చేసిన గొప్పపని ద్వారా, తీర్చిదిద్దిన ద్వారా ఈ శతాబ్దపు మేధావిగా మారాడు”
ఎంతగొప్పదో కదా ఆ తల్లి .. టీచర్లు బుద్ధిమాంద్యం గల పిల్లవాడు మేం పాఠాలు నేర్పమన్న విషయాన్ని ఎడిసన్ కు చెప్పకుండా తన గుండెలోనే దాచుకుని..తన కొడుకును గొప్ప మేధావిగా మార్చగలిగింది. తన కొడుకు వెర్రివాడు అని అప్పుడే అతన్ని కట్టెతో బాదితే మనకు గొప్ప సైంటిస్ట్ దొరికేవాడే కాదు. కొడుకు లోపం తెలుసుకుని..అతడి మేధకు మెరుగులు పెట్టిన ఆ మాతృహృదయాన్ని ఎంత కీర్తించినా తక్కువే. తమ బిడ్డలకు మార్కులు తక్కువగా వచ్చాయని ఇతరులతో పోలుస్తూ కించపరుచడమో, కొట్టడమో చేస్తున్న నేటి తరపు తల్లులకు పసిహృదయాల బాధ అర్థమవుతుందా..చిన్నారుల మనసులో ఏముందో తెలుసుకోకుండా తమ అభిప్రాయాలను వారిపై రుద్దుతున్న నేటి తరపు తల్లిదండ్రులు ఎడిసన్ తల్లిలా తమ పిల్లలకు కావాల్సింది ఏమిటో ఇప్పటికైనా గుర్తించగలరా?. మార్కుల వేటలో పడడం కాదు పిల్లలను నమ్మాలి..వారి ఆలోచనలు ఏంటో తెలుసుకోవాలి..వారికి అనువైన రీతిలో వారిని ముందుకెళ్లనివ్వాలి.. దూషణలు, దండింపులతో చిన్నారుల ఉన్నతిని ఎప్పుడూ సాధించలేం. ప్రేమ, అనురాగాలతో మాత్రమే బిడ్డలకు బంగారు భవిష్యత్ ను అందించగలం.