AP Politics : మినీ యుద్ధాలు గెలిస్తేనే ‘మహా యుద్ధం’లో గెలుపు..!?

AP Politics

AP Politics

AP Politics : ఏపీలో ఎన్నికల వేళ రసవత్తర రాజకీయాలు సాగుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీకి 10 ఎమ్మెల్యే, 6 ఎంపీ సీట్లు లభించాయి. తాజాగా బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ, వైసీపీ అధినేతలు ప్రచారం కూడా ప్రారంభించేశారు. ఈ ఎన్నికలలో కూటమిలోని పార్టీలకు వైసీపీకి మధ్య యుద్ధం జరుగుతోందని మనకు తెలుసు. అయితే అసలు యుద్ధం కంటే ముందే పలు మినీ(అంతర్గత) యుద్ధాలను అభ్యర్థులు దాటుకుని వెళ్లాల్సి ఉంది.

బీజేపీ ప్రకటించిన అభ్యర్థులకు బీజేపీలోని టికెట్లు రాని ‘వైసీపీ మిత్రులకు’ మధ్య ముసుగులో గుద్దులాటలు తప్పవు. కనుక బీజేపీ అభ్యర్థులు వైసీపీ కంటే ముందుగా సొంత పార్టీ నేతలనే జయించవల్సి ఉంటుంది. అయితే వారితో పోటీ పడి టికెట్లు సాధించారు. కనుక ఇప్పుడు మొదలయ్యే రెండో మినీ యుద్ధంలో కూడా విజయం సాధించి వారి మద్దతు పొందగలిగితే, ఎన్నికలలో సగం విజయం సాధించినట్లే.

అలాగే బీజేపీతో పొత్తు కారణంగా టీడీపీ, జనసేనలలో టికెట్స్ పోగొట్టుకున్న వారితోనూ మినీ యుద్ధాలు తప్పవు. దీని తర్వాత అసలు యుద్ధం మే 13న వైసీపీతో జరుగుతుంది. ఇక జనసేన కూడా ఇంచుమించు ఇటువంటి సమస్యలనే ఎదుర్కొంటోంది. టికెట్ల విషయంలో ఏర్పడిన అసంతృప్తి, అసహనంతో పాటు, కుల రాజకీయాలు, వైసీపీ ఉచ్చులకు చిక్కుకుని ఇబ్బందులు సృష్టిస్తున్న వారితో జనసేన సతమతమవుతోంది. పార్టీలో అందరినీ హెచ్చరిస్తూ పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో ఓ లేఖ రాయాల్సి వచ్చిందంటే జనసేనలో కుమ్ములాటలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

టీడీపీ కూడా అభ్యర్థుల విషయంలో అంతర్గతంగా ఇటువంటి సమస్యలే ఎదుర్కొంటున్నా జనసేన, బీజేపీ అంత కాదు. ఎందుకంటే టీడీపీపై వైసీపీ ప్రభావం దాదాపు ఉండదు. కానీ జనసేన, బీజేపీ మీద వైసీపీ ప్రభావం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉంటుంది కనుక ఆ రెండు పార్టీలకు కొన్ని ఊహించని సమస్యలు, ఇబ్బందులు తప్పకపోవచ్చు. కనుక జనసేన, బీజేపీ వీలైనంత త్వరగా ఈ సమస్యలను అధిగమించి అసలు యుద్ధానికి సిద్ధం కావాల్సి ఉంటుంది. మూడు పార్టీలు కలిసి రోడ్ షోలు, భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రజల్లో కూటమి పట్ల నమ్మకం కల్పించాల్సి ఉంటుంది. అప్పుడే కూటమి ద్వారా తమకు మంచి పాలన అందుతుందని జనాలు భావిస్తారు. అలాగే మూడు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు కూడా సక్రమంగా జరుగుతుంది.

TAGS