Win Fast : ఏపీలో రూ.4 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న విన్ ఫాస్ట్
Win Fast : ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ప్రపంచంలోనే పేరుగాంచిన విన్ ఫాస్ట్ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో విన్ ఫాస్ట్ కంపెనీ సీఈవో పామ్ సాన్ చౌ, కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ నేతృత్వంలో కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేశారు.
వియత్నాంలో బాగా ఫేమస్ అయిన ఈ కంపెనీకి రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబుతో చర్చించినట్లు మంత్రి భరత్ తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఓర్వకల్లులోనే కాకుండా కృష్ణపట్నంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవసరమైన భూమి, మౌలిక వసతులు కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని విన్‌ఫాస్ట్ ప్రతినిధులతో చంద్రబాబు చెప్పినట్లు మంత్రి తెలిపారు.
30 రోజుల తర్వాత రాయితీలపై చర్చిస్తామని, అన్నీ అనుకూలంగా ఉంటే కంపెనీ ఎక్కడ ఏర్పాటు చేయాలో తెలుస్తుందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పారిశ్రామికవేత్తలు ఏపీకి తరలివస్తున్నారని మంత్రి భరత్ అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సంస్థ ప్రతినిధులకు సీఎం వివరించారు. ఏపీలో ఈవీ, బ్యాటరీల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. ప్లాంటుకు అవసరమైన భూమి, ఇతర మౌలిక వసతులు సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెట్టుబడులు పెట్టేందుకు… అన్ని విధాలుగా సహకరించాలని కోరారు. అంతకుముందు విన్ ఫాస్ట్ కంపెనీ ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు విందు ఇచ్చారు.