Vangaveeti Radha : వంగవీటి జనసేనలో చేరుతారా? బాలశౌరి చర్చలు ఎందాక వచ్చాయి..
Vangaveeti Radha : ఏపీలో రాజకీయాలు వ్యూహత్మకంగా సాగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు దూకుడుగా ముందుకెళ్తున్నాయి. అధికార వైసీపీ 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించగా, ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ పొత్తులో భాగంగా మరో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రాజకీయ పార్టీలన్నీ కూడా గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలని భావిస్తున్నాయి. ఈక్రమంలో టికెట్ దక్కని నేతలు తమ పార్టీలను వీడి, టికెట్ పై హామీ ఉన్న పార్టీల్లోకి జంప్ అవుతున్నారు.
ఇదిలా ఉండగా టీడీపీలో టికెట్ దక్కుతుందని గంపెడు ఆశలు పెట్టుకున్న వంగవీటి రాధాకు నిరాశే ఎదురైంది. విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం తనకు కేటాయిస్తారని ఆయన, ఆయన అనుచరులు భావించారు. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో రాధాను పక్కనపెట్టి ఇతరులను చంద్రబాబు ప్రకటించారు. రాధాకు మరోసారి మొండిచేయి ఎదురైంది. దీంతో ఆయన టీడీపీని వీడి వైసీపీలోకి చేరుతున్నారనే ప్రచారం జరిగింది.
వైసీపీలో చేరితే మచిలీపట్నం పార్లమెంట్ స్థానాన్ని ఇస్తామని రాధాకు ఆఫర్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే రాధా వైసీపీలోకి వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపడంలేదు. తాజాగా రాధా టీడీపీని వీడి పవన్ జనసేనలో చేరడానికి రెడీ అవుతున్నారని సమాచారం. ఈమేరకు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రాధాతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.
బాలశౌరి ఇటీవల అధికార వైసీపీని వీడి జనసేనలో చేరారు. ఆయన వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం జనసేన అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. దీంతో ఎలాగైనా రాధాను జనసేనలోకి తీసుకురావడానికి బాలశౌరి ప్రయత్నాలు చేస్తున్నారు. రాధా జనసేనలో చేరితే అవనిగడ్డ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. మరి టీడీపీని వీడి జనసేనలో చేరుతారో లేదో కొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది.