Retirement Employees : వడ్డించేవాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా నష్టమేమీ ఉండదు. పలుకుబడి ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మంది ఉద్యోగులు రిటైర్ అయినా తమ పలుకుబడితో ఉద్యోగాల్లోనే కొనసాగుతున్నారు. దీంతో అర్హులకు మొండిచేయి చూపిస్తున్నారు. దీంతో వారు నైరాశ్యంలో పడిపోతున్నారు. తమకు అన్ని అవకాశాలున్నా అప్పటి సర్కారు తీరు అయోమయంలో పడేసింది.
ఉద్యోగ విరమణ చేసినా ఉద్యోగాల్లో కొనసాగే వారు వందల మంది ఉన్నారు. దీని వల్ల వారి కింద ఉన్న వారికి పదోన్నతులు రాకుండా పోతున్నాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు వీరిని తొలగించాలని నిర్ణయించుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. వివిధ శాఖల్లో రిటైరయినా ఉద్యోగాల్లో కొనసాగే వారి జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో వారి జాబితా బుధవారం రెడీ కానుంది.
తమ పలుకుబడితో ఉద్యోగాల్లో కొనసాగుతూ రాజ్యాంగ విరుద్ధంగా విధులు నిర్వహిస్తున్నారు. వారికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం వంత పాడింది. వారితో తమకు అనుకూల పనులు చేయించుకుందనే ఆరోపణలున్నాయి. అయినా వారి పనులు సాఫీగా సాగడానికే వారిని విధుల్లో కొనసాగించారు. దీంతో చాలా సమస్యలొస్తాయని తెలిసినా వారి అధికారాలు ఉపయోగించి పాత వారిని ఉద్యోగాల్లో నియమించుకోవడంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు.
కేసీఆర్ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఇలా ఉద్యోగ విరమణ చేసిన వారిని చంకనెక్కించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. వీటిని సరిచేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతోనే రిటైర్ అయిన వారిని ఇంకా విధుల్లో ఉంచుకోవడం సరైంది కాదనే వాదనలు వస్తున్నాయి. రిటైర్ అయినా విధుల్లో కొనసాగే వారిని ఇంటికి పంపించే కార్యాచరణ మొదలైంది.