JAISW News Telugu

AP Elections : ఓట్ల బదలాయింపు జరిగేనా? 2009 పునరావృతం అవుతుందా?

AP Elections

AP Elections

AP Elections : సుదీర్ఘ చర్చల అనంతరం టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల సర్దుబాటు కుదిరింది. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్ సభ, బీజేపీకి  10 అసెంబ్లీ, 6 ఎంపీ, టీడీపీకి 144 అసెంబ్లీ, 17ఎంపీ సీట్లు దక్కాయి. ఇక అభ్యర్థులను ప్రకటించి ప్రచార రంగంలోకి దూకడమే మిగిలి ఉంది.

అయితే పొత్తులు కుదిరినా బలమైన వైసీపీని ఎదుర్కొని విజయం సాధించాలంటే ఓట్ల బదలాయింపు కూడా జరగాలి. లేకుంటే 2009లో వచ్చిన ఫలితమే మళ్లీ వస్తుందా అనేది ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షాలు మహా కూటమిగా కలిసి పోటీ చేశాయి. అలాగే కాంగ్రెస్, ప్రజారాజ్యం ఒంటరిగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నా ఒక్కో చోట  రెండు పార్టీలు తమ అభ్యర్థులను నిలిపాయి. ఓట్ల బదలాయింపు సరిగ్గా జరగలేదు. దీంతో మహాకూటమి పేరుతో పార్టీలన్నీ కలిసి వచ్చినా  కాంగ్రెస్సే విజయం సాధించింది. అయితే ప్రజారాజ్యం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను బాగానే చీల్చింది. ఆ ఎన్నికల్లో టీడీపీ 28.12 ఓట్ల శాతంతో 92 సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 36శాతం ఓట్లతో 185 స్థానాలను గెలుచుకుంది.

వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఇక ఇప్పుడు జగన్ నేతృత్వంలోని వైసీపీ రెండో సారి అధికారంలోకి రావడానికి తహతహలాడుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీలకుండా ఉంటేనే టీడీపీ కూటమికి ప్రయోజనం కలుగుతుంది. అయితే జనసేనకు అతి తక్కువ సీట్లు కేటాయించడంపై జనసైనికులు, కాపు సామాజిక వర్గ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్లను ఎలా మేనేజ్ చేస్తారు..ఓట్ల బదలాయింపు సక్రమంగా జరుగుతుందా లేదా అనేది అనుమానంగానే ఉంది.

ఈ పరిణామాలను చంద్రబాబు, పవన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి. టీడీపీ శ్రేణులు, జనసేన, బీజేపీలకు, జనసైనికులు, బీజేపీ శ్రేణులు టీడీపీకి ఓటెయ్యడంపైనే పొత్తు విజయం ఆధారపడి ఉందని చెప్పవచ్చు. దీనికి పెద్దపార్టీ అధినేతగా చంద్రబాబు ఎలాంటి వ్యూహాలు రచిస్తారో చూడాలి.

Exit mobile version