Postal Ballot Results : పోస్టల్ బ్యాలెట్ ఫలితాలను తారుమారు చేయనుందా ?
Postal Ballot Results : ఏపీలో అటు అసెంబ్లీ, ఇటు లోక్ సభ స్థానాలకు మే 13న పోలింగ్ పూర్తయింది. రాష్ట్రంలో అధికారం ఎవరి హస్తగతం అవుతుందో జూన్ 4న తేలనుంది. ఇప్పటికే పార్టీల అధినేతలకు ఎన్నికల ఫలితం పైన స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. పలు సర్వే సంస్థలు తమ అంచనాలు ఎగ్జిట్ పోల్స్ రూపంలో వెల్లడించటానికి రెడీ అయ్యాయి. ఈ సమయంలో పోస్టల్ బ్యాలెట్, ఉద్యోగుల ఓటింగ్ సరళి పైన క్రమక్రమంగా స్పష్టత వస్తోంది. వైసీపీకి ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారన్న అభిప్రాయం బలంగా ఉంది. ఈ లెక్కలతో వైసీపీ విభేదిస్తోంది.
ఏపీ ఎన్నికల కౌంటింగ్ పై క్షణక్షణానికి ఉత్కంఠ పెరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ వినియోగంలో ఏపీ ఉద్యోగులు కొత్త చరిత్ర సృష్టించారు. రెట్టింపు సంఖ్యలో ఈ సారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. దాదాపు 5.40లక్షల పోస్టల్ బ్యాలెట్లను ఈ సారి ఉద్యోగులు వినియోగించుకున్నారు. ఎన్నికల విధుల్లోని ఉద్యోగులు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ వినియోగించారు. వారితోపాటు తొలిసారిగా ప్రవేశ పెట్టిన హోమ్ ఓటింగ్ విధానంలో 13,700 మంది 85 ఏళ్లు దాటిన వృద్ధులు, 12,700 మంది దివ్యాంగులు పోస్టల్ బ్యాలెట్ తో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఈ సారి భారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రావడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కాస్త ఆలస్యంగా కొనసాగే అవకాశం ఉంది.
పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో సుమారు ఐదు లక్షల మంది ఉద్యోగులు పాల్గొన్నారు. యూటీఎఫ్, ఏపీటీఎఫ్, పీఆర్టీయూ, ఎన్జీవో సంఘాల్లోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగుల్లో వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తుందన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే 5 లక్షల ఉద్యోగుల ఓట్లల్లో ప్రభుత్వానికి 30 శాతమే అనుకూల ఓట్లు పడతాయని, అంటే 1.5 లక్షల కుటుంబాలు వైసీపీకి మద్దతు పలికితే.. 3.5 లక్షల కుటుంబాలు వ్యతిరేకిస్తాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇదే జరిగితే 14 లక్షల ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడ్డట్లే ..
పోస్టల్ బ్యాలెట్ లెక్కించేటప్పుడు చాలా సునిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. ప్రతి పోస్టల్ బ్యాలెట్‌ను అక్కడ ఉన్న అభ్యర్థి.. ఏజెంట్లకు ఓ సారి చూపించి అనంతరం అతి చెల్లుతుందా లేదా అని తేల్చాల్సి ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ కవర్ ఏ తో పాటు ఓటర్ డిక్లరేషన్ ఫామ్ విడిగా ఉంటేనే ఆ ఓటు చెల్లుబాటు అవుతుంది. గెజిటెడ్ సంతకం లేకపోయినా ఆ ఓటు చెల్లదు. పోస్టల్ బ్యాలెట్ వెనుక ఆర్వో సంతకం ఉండాలి. అయితే ఈ సారికి దీని నుంచి మినహాయింపు ఇవ్వాలని టీడీపీ కోరింది. ముఖేష్‌కుమార్ మీనా మౌఖికంగా ఓకే చెప్పినా ఇంత వరకు అధికారిక ఉత్తర్వులు మాత్రం రాలేదని తెలుస్తోంది. దీని పైన అధికార పార్టీ వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనివల్లే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మరింత ఉత్కంఠకు కారణం.