Nirmala Sitharaman : పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తారా?.. నిర్మలా సీతారామన్ సమాధానం..
Nirmala Sitharaman : పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తారంటూ వస్తున్న ఊహాగాలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. వేతన జీవులకు కొంత ఊరట కల్పిస్తూ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ తో పాటు, శ్లాబుల్లోనూ చిన్నపాటి మార్పులు చేశారు. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులూ చేయలేదు. అయితే, కొన్నేళ్లుగా కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారే తప్ప పాత విధానం జోలికి వెళ్లడం లేదు. దీంతో పాత పన్ను విధానానికి చరమగీతం పాడుతారన్న ఊహాగానాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బడ్జెట్ అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఇదే ప్రశ్న ఎదురైంది.
దీనిపై ఆమె స్పందిస్తూ పాత పన్ను విధానం రద్దు చేసే అంశంపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని నిర్మలా సీతారామన్ అన్నారు. పన్ను విధానాన్ని సులభతరం చేయడమే కొత్త పన్ను విధానం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. క్లిష్టమైన పాత పన్ను విధానాన్ని సరళీకరించే క్రమంలో కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చామన్నారు. ఇప్పటికిప్పుడు పాత విధానాన్ని రద్దు చేస్తాా? లేదా? అనేది చెప్పలేమని, సమీక్షించాకే నిర్ణయం తీసుకోగలమని నిర్మలా సీతారామన్ వివరించారు.