special in-charge : క్రమ శిక్షణకు మారుపేరు చంద్రబాబు నాయుడు. ఆయనే కాదు.. ఆయన చుట్టూ ఉన్న వారు కూడా క్రమ శిక్షణగా ఉండాలంటారు. లేదంటే యాక్షన్ భారీగానే ఉంటుంది. పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న కొందరు ఎమ్మెల్యేలపై కఠిన వైఖరి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అలాంటి ఎమ్మెల్యేల్లో కృష్ణా జిల్లా తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కొలికపూడి శ్రీనివాస రావు ఒకరు. అమరావతి రైతుల ఉద్యమంలో చురుగ్గా పాల్గొని తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొలికపూడి తన వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో పార్టీకి చిక్కులు తెచ్చిపెడుతున్నారు.
ఎన్నికల ప్రచారంలోనే కొలికపూడి వ్యవహారశైలిపై ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల సర్పంచ్ భార్య ఆత్మహత్యాయత్నం, మహిళలపై అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలు, జర్నలిస్టులు, రైతులపై బెదిరింపులు వంటి ఘటనలు తిరువూరులో పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా చేస్తున్నాయి. వీరికే కాదు కొలికపూడి వ్యవహారం పాత్రికేయులను కూడా ఇబ్బందికి గురి చేసిందట. ఇటీవల చంద్రబాబు నాయుడిని కలిసి తమ గోడు చెప్పుకున్నారట. దీనికి తోడు మాజీ ఎమ్మెల్యే విషయంలో కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారట. ఇవి ఉద్రిక్తతలకు దారి తీసేలా ఉన్నాయని పార్టీ స్థానిక నేతలు బాస్ కు వివన్నవించారు. కొలికపూడి వ్యవహారంపై సమాచారం అందుకున్న చంద్రబాబు యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం.
కొలికపూడి ప్లేస్ లో తిరువూరుకు కొత్త పార్టీ ఇన్ చార్జి సీనియర్ నేత ఎస్ దేవదత్ ను నియమించాలని అధినేత మదిలో ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఒక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి ప్రత్యేక పార్టీ ఇన్ చార్జిని నియమించడం ఇదే తొలిసారి అవుతుంది.
వచ్చే వారం నుంచి పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటానని, నియోజకవర్గంలోని పార్టీ వ్యవహారాలన్నీ తానే చూసుకుంటానని దేవదత్ మీడియా సమావేశంలో కూడా ప్రకటించారు. దీన్ని బట్టి బాబు తిరువూరులో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని, కొలికపూడిని పక్కన పెడుతున్నారని స్పష్టమవుతోంది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీకి భారంగా మారిన ఇతర నియోజకవర్గాల్లోనూ ఇదే వ్యూహాన్ని అనుసరించాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం.