Game Changer : జనసేనకు గాజుగ్లాసు గేమ్ చేంజర్ అవుతుందా?

Game Changer

Game Changer Janasena For Gaju Glass Symbol

Game Changer Symbol Gaju Glass : రాజకీయాల్లో పార్టీ సింబల్ కు ఎంతో పవర్ ఉంటుంది. మరెంతో ప్రాధాన్యం ఉంటుంది. ప్రచారంలో ప్రజలను ఉర్రూతలూగించేది, నడిపించేది నాయకులు, నేతలైతే..పోలింగ్ బూత్ లో పార్టీని తెలియజేసేది, గెలిపించేది పార్టీ సింబలే. బ్యాలెట్ లో ఆ సింబల్ ను చూసే ఓటర్లు ఓటు వేస్తారు. అందుకే మంచి ఆకర్షణీయ, సామన్యుడిని ఆకట్టుకునేలా ఉండే సింబల్ ను పార్టీలు ఎంచుకుంటాయి. పార్టీలు గుర్తింపు పొందితే ఎన్నికల సంఘం వాటికి నచ్చిన గుర్తును కేటాయిస్తాయి.

రాజకీయాల్లో పార్టీ సింబల్ కు అంత ప్రాధాన్యం ఉంటుంది కనుక..దీని కోసం పోరాటాలు కూడా నడుస్తాయి. మొన్నటికి మొన్న శివసేన చీలిక వర్గాల మధ్య పార్టీ సింబల్ కోసం ఎంతో తతంగం నడిచింది. గతంలో మన ఏపీలో కూడా సైకిల్ గుర్తు కోసం చంద్రబాబు, లక్ష్మీపార్వతి పార్టీల మధ్య పోరు నడిచింది. అయినా చంద్రబాబు నుంచి ఆ సింబల్ నుంచి తీసుకోలేకపోయారు. మెజార్టీ పక్షమున్న వారికే ఇలాంటి సందర్భాల్లో పార్టీ సింబల్ ను కేటాయిస్తారు. పార్టీ సింబల్ అనేది ఆ పార్టీ శ్రేణులకు, నాయకులకు ఓ ఎమోషనల్ అనే చెప్పాలి. ఆ గుర్తుకు జై కొట్టడం ద్వారా ప్రజల్లో ప్రచారం చేయడం, వారి ఆదరణ పొందడం వంటివి మనం చూస్తు ఉంటాం. పార్టీ సింబల్ ఇంతటి విశేష నేపథ్యం ఉంది.

జనసేన పార్టీకి గాజు గ్లాసును ఎన్నికల గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఈ మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అందించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపైనే జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. ఈ సారి జరుగబోయే ఎన్నికల్లోనూ గాజు గ్లాసు గుర్తుతోనే జనసేన అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలువనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వు కాపీలను పార్టీ లీగల్ సెల్ చైర్మన్ ఇవన సాంబశివ ప్రతాప్ బుధవారం పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు అందించారు.

జనసేనకు గాజుగ్లాసు గుర్తు రావడంపై పార్టీ శ్రేణులకు, అధినేత పవన్ కు ఓరకంగా ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ రెడ్డిని ఓడించడమే ధ్యేయంగా పవన్, టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. ఈక్రమంలో జనసేనను డిమోటివేట్ చేయడానికి వైసీపీ వర్గాలు జనసేనకు గాజు గ్లాసు సింబల్ రాదు..అంటూ విమర్శించాయి. దీంతో పాటు ఎన్నికల సంఘం దగ్గర జనసేనకు గాజు గ్లాసు కేటాయించవద్దని కూడా విజ్ఞప్తి చేశాయి. సింబల్ రాకుండా ఎంత చేయాలో అంత చేశారు. సింబల్ లేని పార్టీ అంటూ సోషల్ మీడియాలో జనసేనపై ట్రోల్ కూడా చేశాయి.

జనసేనకు రాజకీయంగా కీలకమైన తరుణంలో గాజుగ్లాసు రావడమనేది ఆ పార్టీకి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు భారీ సంఖ్యలో అసెంబ్లీ సీట్లు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో సొంత సింబల్ తో పోటీ ఆ పార్టీకి ఎంతో మేలు చేయనుంది. జనసేన అంటే గాజుగ్లాసు అనే ఐడెంటిటీ కూడా ప్రజల్లోకి వెళ్లింది. సాధారణ ఓటరు కూడా పవన్ పార్టీ సింబల్ అంటూ ఈ సింబల్ ను గుర్తుపడతారు. ఇదే రేపటి ఎన్నికల్లో గాజుగ్లాసు ఓటర్ల ఆదరణ పొందేందుకు దోహదం చేస్తుందని చెప్పవచ్చు. ఈసారి ఎన్నికల్లో కోస్తాంధ్రలో జనసేన మంచి ప్రదర్శనే చేయనుందనే టాక్ నడుస్తుండడం, టీడీపీతో పొత్తు ఉండడం, జగన్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఇవన్నీ కూటమికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ సానుకూల నేపథ్యంలో జనసేనకు గాజు గ్లాసు గేమ్ చేంజర్ కాబోతోంది.

TAGS