Kamma Community : కమ్మ సామాజికవర్గ కృషి ఫలించబోతుందా?

Kamma Community

Kamma Community

Kamma Community : ఏపీలో ఎన్నికలు ముగిసి..ఫలితాల కోసం వేచి చూస్తున్న సమయమిది. ఎన్నికల పోలింగ్ ముగియగానే ప్రధాన పార్టీలు తమ విశ్వసనీయ వర్గాల ద్వారా ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్నారు. నియోజకవర్గాల వారీగా తమ పార్టీకి అనుకూలంగా పోలైన ఓట్లు, ఓటర్ల నాడీని తెలుసుకుని..ఓ అంచనాకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి, వైసీపీ రెండూ కూడా తామే అధికారంలోకి రాబోతున్నామని భావిస్తున్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని..ఆ పార్టీకి మద్దతుగా ఉన్న కమ్మ సామాజిక వర్గం బలమైన అంచనాకు వచ్చింది. వాస్తవానికి కమ్మ సామాజిక వర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ఆధిపత్యం కోసం ఎన్నో రోజులు వేచి చూసింది. టీడీపీ ఆవిర్భావించక ముందు రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం నాలుగు దశాబ్దాలకు పైగా నడిచింది. ఆ తర్వాత ఎన్టీఆర్ చే పార్టీని స్థాపింపచేసి తమ దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చుకున్నారు.

ఆ తర్వాత చంద్రబాబు రూపంలో మరో పదేళ్లు ఉమ్మడి రాష్ట్రాన్ని శాసించగలిగారు. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు..టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో తెలంగాణలో వారి ఆధిపత్యానికి తెరపడింది. ఇక ఏపీలో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కమ్మ సామాజిక వర్గాన్ని రాజకీయంగా అణిచివేశాడని వారిలో ఆందోళన మొదలైంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో  అధికారం నిలబెట్టుకోకపోతే తమ రాజకీయ అస్థిత్వానికి దెబ్బపడే అవకాశాలున్నాయని గ్రహించారు. అందుకే ఏపీలోని కమ్మ సామాజికవర్గంలోని ప్రతీ ఒక్కరూ టీడీపీ కూటమిని గెలిపించడానికి కృషి చేశారు. ఆ సామాజికవర్గంలోని ప్రముఖులు, ఎన్ఆర్ఐలు, మీడియా, వైద్యులు, టీచర్లు, లాయర్లు, ..ఇలా ప్రతీ ఒక్కరూ కసితో టీడీపీ గెలుపునకు అహర్నిషలు కష్టపడ్డారు. ఎన్నికల ఫలితాలు టీడీపీ కూటమి అనుకూలంగా వస్తున్నాయని అంచనా వేస్తున్నారు.  చంద్రబాబును సీఎం అవ్వడం ఖాయమనే భరోసా వారిలో కనిపిస్తుంది. మరి కమ్మ సామాజికవర్గీయుల ఆకాంక్ష నెరవేరుతుందా లేదా అనేది జూన్ 4న తెలియబోతుంది.

TAGS