Sharmila : గడిచిన రెండు ఎన్నికల్లో నోటాతో హోరా హోరీగా పోరాడిన కాంగ్రెస్ 2019లో నోటా కంటే తక్కువ ఓట్లు సాధించింది. 2024లో వైఎస్ కుటుంబ వారసురాలిగా వైఎస్ షర్మిల రాకతో పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది.
షర్మిల తన మాస్ కార్యక్రమాలతో ఏపీలో కాంగ్రెస్ ను పొలిటికల్ మ్యాప్ లోకి తెచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలే చారిత్రాత్మకంగా కాంగ్రెస్ వెంట ఉన్నాయని, షర్మిల ఈ వర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పారు.
సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడటం ద్వారా అధికార వ్యతిరేక ఓట్ల శాతాన్ని కూడా రాబట్టుకోవాలని చూస్తున్నారు షర్మిల. ఇది వైఎస్ కుటుంబ అనుచరులకు ఇబ్బంది కలిగించవచ్చు కానీ ఏ ప్రతిపక్ష పార్టీకైనా అధికార వ్యతిరేకత తప్పనిసరని, ఈ లాజిక్ ను షర్మిల వర్కవుట్ చేశారని అంటున్నారు. ఇది జగన్ వ్యతిరేక ఓట్లను రాబట్టుకోవడానికి కాంగ్రెస్ కు సహాయపడుతుంది.
మరీ ముఖ్యంగా కాంగ్రెస్ లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లపై మళ్లీ చర్చ జరుగుతోంది. 2014, 19 ఎన్నికల్లో చెప్పుకోదగ్గ అభ్యర్థులు లేకపోవడంతో ఇప్పుడు కనీసం ఒక వర్గం ఎమ్మెల్యే సీట్లకైనా డిమాండ్ ఉన్న స్థితికి ఆ పార్టీ వచ్చింది.
2019 ఎన్నికల్లో నారా లోకేశ్ ను ఓడించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికీ కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఇతర వైసీపీ, టీడీపీ రెబల్స్ కూడా తమకు టికెట్లు ఇవ్వకపోతే కాంగ్రెస్ రైలు ఎక్కే అవకాశం ఉంది. షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ కు అభ్యర్థులు వస్తున్నారు. వీటితో షర్మిల గత రెండు ఎన్నికల్లో నాయకత్వ లేమితో సతమతమవుతున్న కాంగ్రెస్ ను కనీసం పొలిటికల్ మ్యాప్ లో పెట్టారు.