Nara Lokesh : మళ్లీ మంగళగిరి నుంచే లోకేష్.. గెలుస్తాడా?
Nara Lokesh Contest Mangalagiri : రాజకీయాల్లో ఏదీ ఊహించలేం. అభ్యర్థుల గెలుపు నిర్ణయించడంలో ప్రజల ఆశీస్సులు, ఎన్నికల మూడ్ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతిసారీ ఎవరూ ఓడిపోరు. ఓడిపోవాలని కూడా కోరుకోరు. టీడీపీ వారసుడు నారా లోకేశ్ కూడా ఇదే ఫార్ములాపై కసరత్తు చేస్తున్నారు.
2019లో మంగళగిరి నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు నారా లోకేశ్. ఇక యువరాజు ఆగమనంతో ఉబ్బితబ్బిప్పు అయిపోయిన టీడీపీ క్యాడర్ ఎలాగైనా లోకేశ్ గెలుస్తాడని విశ్వసించింది. తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి నాయకుడిగా గుర్తింపు ఉండడంతో లోకేష్‌కు అది కేక్‌వాక్ అవుతుందని అంతా అభిప్రాయపడ్డారు. ఇంకా, అమరావతిని రాజధాని కాగా.. మంగళగిరి అసెంబ్లీ స్థానం రాజధాని నగరానికి సమీపంలో ఉంది. లోకేష్ యువ నాయకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ లెక్కలన్నీ తికమక అయ్యాయి. ఆ సమయంలో లోకేష్ ప్రత్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు.
ఆ సమయంలో టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య ముక్కోణపు పోరు నడిచింది. జనసేన కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని ముప్పాళ్ల నాగేశ్వరరావు నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో ఓట్లు ఘనంగా చీలిపోయాయి. లోకేష్ 5,333 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇది ఆళ్ల రామకృష్ణా రెడ్డి వరుస విజయానికి దారితీసింది.
ఇప్పుడు లోకేష్ మళ్లీ ఎన్నికలకు రెడీ అవుతున్నారు. గతంలో ఓడిపోయిన సీటు నుంచే మళ్లీ బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఓటమి చోటే గెలుపు వెతుక్కుంటానన్న యువరాజు పట్టును చూసి మురిసిపోయిన నాయుడు అదే సీటు ఖారారు చేసేలా కనిపిస్తుంది.
టీడీపీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు కృషి చేస్తున్నారు. దీంతో లోకేష్ మంగళగిరి నుంచి ఓడిపోయినా ప్రజల్లో మాత్రం ఆయనకున్న ఇమేజ్ చెక్కుచెదరలేదు. మంగళగిరిలో నేతన్నల ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో లోకేష్ చాలా మందికి నగదు సాయం అందజేస్తున్నారు. ఇది కాకుండా వీధి వ్యాపారులకు కూడా టీడీపీ తోపు బండ్లు ఇచ్చింది. లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి కూడా తన భర్తకు ఓటేయాలని అభ్యర్థిస్తూ ప్రచారం, ఓటర్లను కలవడం వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
లోకేష్ బలాలేంంటి?
‘యువగళం’ పాదయాత్ర నిర్వహించి గత ఎన్నికల్లో ఓటమి, నిరసనలు చేస్తున్న అమరావతి రైతులకు సంఘీభావం వంటి అంశాలతో సానుభూతి సంపాదించుకున్నారు. మంగళగిరిలో ‘అన్న క్యాంటీన్’ ప్రారంభించి యువత సొంతంగా వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. అదే సమయంలో, అతనిలో లోపాలు కూడా సరిచేసుకున్నారు.
లోకేష్ మంగళగిరి వాసి కాదు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కార్మికులను లోకేష్ తనవైపు తిప్పుకోలేకపోతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ లెక్కలు ఎలా ఉన్నప్పటికీ, లోకేష్, అతని మద్దతుదారులు నియోజకవర్గం నుంచి విజయంపై చాలా ఆశలు పెట్టుకున్నారు.