KCR – Jagan : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఈ రోజు (జూలై 6-శనివారం) ముఖాముఖి సమావేశం కానున్నారు. పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల గురించి ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. వాటిలో 75 శాతం సంక్లిష్టమైనవే ఉన్నాయి. ఎన్నో చిక్కుముడులను ఒకే ఒక్క సమావేశంతో విప్పుతారని కాదు గానీ, కొన్ని పరిష్కారం చూపినా.. మరొకన్నింటికి మార్గం సుగమనం అవుతుందని అంతా భావిస్తున్నారు.
కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉన్న సమయంలో ఈ సమస్యలను పరిష్కరించకుండా వాటితో తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తూ బీఆర్ఎస్ పార్టీ కోసం వాడుకున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి దయనీయంగా మారింది. కనుక ఇంకా సెంటిమెంట్ ను వాడుకోవాలనే అనుకుంటున్నాడు. శుక్రవారం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు చేరుకున్నప్పుడు ఆయనకు స్వాగతం చెపుతూ టీటీడీపీ నేతలు ఫ్లెక్సీలు, బ్యానర్లు కడితే, ‘తెలంగాణపై మళ్లీ ఆంధ్రా పెత్తనం మొదలైందని’ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం మొదలుపెట్టడమే ఇందుకు నిదర్శనం.
అంటే విభజన సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోవాలని బీఆర్ఎస్ కోరుకుంటున్నట్లు భావించవచ్చు. ముందుగా సెంటిమెంట్ నుంచి రాజకీయాలను దూరం చేయాలి. రాజకీయాలకు అతీతంగా అధికారులు, మేథావులు, నిపుణులతో కమిటీలు వేసి ఈ సమస్యలను పరిష్కరించుకోవాలి.
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తుంది. కనుక వీటిని ధీటుగా ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేదంటే ఈ సమస్యలపై చర్చలు మధ్యలోనే నీరుగారే ప్రమాదం ఉంది. తెలంగాణ రాజకీయ పరిణామాల్లో మార్పులు మొదలైతే ఈ ప్రక్రియ నిలిచిపోయే అవకాశం ఉంటుంది.
అంటే విభజన సమస్యలను పరిష్కరించాలనుకుంటే సరిపోదని వాటితో ముడిపడి ఉన్న ఈ రాజకీయాలను ఛేదించాల్సి ఉంటుందని స్పష్టం అవుతోంది. మరో విధంగా చెప్పాలంటే విడిపోయిన దంపతులు చట్టబద్దంగా విడాకులు తీసుకోకుండా కీచులాడుకుంటూ సమస్యలతో గడుపుతున్నట్లు అనుకోవచ్చు.
కానీ విభజన సమస్యలను పరిష్కరించగలిగితే 2 రాష్ట్రాలకు ఎలాగూ మేలు కలగుతుంది. వాటితో పాటు ఇకపై బీఆర్ఎస్, వైసీపీలు రాజకీయాలు చేసే అవకాశం లేకుండా చేయవచ్చు. కనుక ఇరువైపులా ప్రభుత్వాలు పట్టుదలతో, చిత్తశుద్ధితో వీలైనంత వేగంగా ఈ పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది.