Congress : కాంగ్రెస్ నుంచి జగన్ కు చెక్ పడనుందా?
Congress : ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘోర పరాజయం పాలయ్యారు. మొత్తం 175 సీట్లకు గాను కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుకు టీడీపీ 16 మంది ఎంపీలను ఇవ్వడం ఆయనను మరింత కుంగ దీస్తున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు నాయుడు ఢిల్లీ ప్రభుత్వాన్ని శాసించేంత అధికారం సంపాదించుకున్నారు. దీంతో జగన్ పై ఉన్న మనీ లాండరింగ్ కేసులు వివేకా హత్య కేసులు మరింత వేగవంతం అవుతాయని, దీనితో పాటు అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడుకు కేంద్రం నుంచి పుష్కలంగా నిధులు వస్తాయని, ఇది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు దోహదపడుతుందని జగన్ కు తెలుసు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పై సీఐడీ దాడులు ప్రారంభించింది. రాబోయే రోజుల్లో మరికొంత మంది అధికారులు, వైసీపీ నాయకులపై దాడులు జరుగేందుకు అవకాశం ఉంది. చంద్రబాబుతో పాటు షర్మిల కూడా జగన్ కు భారీ తలనొప్పిగా మారే అవకాశం ఉంది.
షర్మిల కడప పార్లమెంట్ నుంచి గెలవకపోయినా జగన్ కు వ్యతిరేకంగా చేసిన ప్రచారం పార్టీ ఓటమిలో కీలకపాత్ర పోషించింది. జగన్ ను చంద్రబాబు ఊపిరాడకుండా చేయగలిగితే వైయస్సార్ కాంగ్రెస్ కు వచ్చిన ఆ 11 సీట్లు కూడా లేకుండా పోతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కొంత మేర పుంజుకుంది. ఆ ఊపును ఆంధ్రప్రదేశ్ కు తీసుకురాగలిగితే అది వైయస్సార్ కాంగ్రెస్ కు పెద్ద దెబ్బే అవుతుంది. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు సమానమైన ఓటు బ్యాంకు ఉంది. నిజానికి వైఎస్సార్ మరణానంతరం కాంగ్రెస్ ఓటు బ్యాంకు జగన్ కు బదిలీ అయింది. అదృష్టవశాత్తు షర్మిల గెలవలేదు. ఆమె గెలిచి ఉండి ఉంటే అది ఇంకా పెద్ద సమస్యగా ఉండేది. రాబోయే రోజుల్లో జగన్ కు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు!.