India population : భారత్ అంటే జనం..జనం అంటే భారత్..అందుకే ‘జనభారతం’ అంటుంటారు. గతేడాదే చైనాను అధిగమించి నంబర్ వన్ స్థానంలోకి చేరింది. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్ దేశాల జనాభాతో భారత్ జనాభా ఇంచుమించు సమానమని చెప్పాలి. భారత్ పేరుకే దేశం..కానీ ఒక ఖండానికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. అందుకే భారత ఉప ఖండం అని కూడా పిలుస్తుంటారు.
ఇదిలా ఉండగా..జనాభాలో చైనాను దాటేసిన భారత్ లో మరింత జనాభా పెరుగుతుందని అంతా అనుకుంటారు. అయితే ఇది నిజం కాదంటున్నారు నిపుణులు. జీవనశైలిలో వస్తున్న మార్పుల వల్ల రాబోయే రోజుల్లో జనాభా తీవ్రంగా తగ్గిపోయే చాన్స్ ఉందంటూ అంచనా వేస్తున్నారు. నేటి తరం యువత త్వరగా పెళ్లిళ్లు చేసుకోకపోవడం కూడా ఇలాంటి పరిణామాలకు ప్రధాన సమస్యగా మారనుందని చెబుతున్నారు.
మరో 25 ఏండ్ల తర్వాత జనాభా తగ్గిపోయే అవకాశాలు లేకపోలేదంటున్నారు నిపుణులు. అయితే ఈ ముప్పు కేవలం భారత్ కేనా..మిగతా ప్రపంచ దేశాలకు కూడా ఉందా? జనాభా తగ్గిపోతే వచ్చే నష్టాలేంటి? జనాభాను పెంచుకోవడానికి చైనా ఏం చేస్తోంది? చైనా చేసే ప్రయత్నాలను బట్టి భారత్ నంబర్ వన్ ప్లేస్ లో ఉంటుందా? రెండో ప్లేస్ లో ఉంటుందా అనేది తెలుస్తుంది. ఎందుకంటే జనాభాలో చైనా, భారత్ లకు మాత్రమే ఒకటి, రెండో స్థానాల్లో అవకాశం ఉంది. ఎందుకంటే మిగతా దేశాలన్నీ చాలా తక్కువ జనాభా. మూడో స్థానంలో ఉన్న అమెరికా జనాభా దాదాపు 34 కోట్లు మాత్రమే.