YS Sharmila : ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు స్వీకరించనుంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారనున్నాయి. ఇన్నాళ్లు పార్టీని ముందుకు నడిపించే నాయకుడు లేక చతికిల పడిన కాంగ్రెస్ కు షర్మిల జీవం పోయనున్నారు. షర్మిల ప్రమాణ స్వీకారం వైభవంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానురులోని ఆహ్వానం ఫంక్షన్ హాల్ లో జరిగే కార్యక్రమానికి ఏపీసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు మునియప్పన్, క్రిష్టఫర్ తిలక్ రానున్నారు.
రాష్ట్ర విభజన తరువాత సెంటిమెంట్ గా మిగిలిపోయిన పోలవరం, ప్రత్యేక హోదా అంశాలు ఇప్పటికి ప్రశ్నార్థకంగానే మారాయి. ఇప్పుడు షర్మిల బాధ్యతలు స్వీకరించడంతో ఆ విషయాల్లో ముందడుగు పడుతుందో లేదో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాష్టంలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో ఎలాంటి ఫలితాలుంటాయో అని అనుమానాలు వస్తున్నాయి.
భవిష్యత్ లో రాజకీయం బలోపేతం కావాలంటే షర్మిల అవసరం ఉందని గుర్తించి ఆమెకు బాధ్యతలు అప్పగించింది. నూతన పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టేందుకు ముందు ఇడుపులపాయకు వెళ్లింది. తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించింది. మాజీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, శైలజానాథ్, పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి, సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు లాంటి నేతల మధ్య షర్మిల బాధ్యతలు స్వీకరించనున్నారు.
షర్మిల రాకతో మరికొందరు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నారు. షర్మిల రాకతో కాంగ్రెస్ కు నూతనోత్తేజం రానుందని చెబుతున్నారు. ఇంతకు ముందు పార్టీని వీడిన నేతలు మళ్లీ పార్టీలోకి వచ్చేందుకు చూస్తున్నట్లు సమాచారం. దీంతో పూర్వవైభవం దక్కడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి.