Khammam Congress : ఖమ్మంలో కాంగ్రెస్ మార్క్ రాజకీయం బీఆర్ఎస్ కు అడ్వాంటేజీ కానుందా?

Khammam Congress

Khammam Congress

Khammam Congress : తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు సాధించాలని మూడు ప్రధాన పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. అత్యధిక స్థానాలను గెలుచుకుని రాహుల్ కు గిఫ్ట్ గా ఇవ్వాలని కాంగ్రెస్ ఆశ పడుతోంది. గతం కంటే ఎక్కువ సీట్లు సాధించి తెలంగాణలో మరింత పట్టు సాధించాలని బీజేపీ భావిస్తోంది. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయానికి లోక్ సభ ఎన్నికల్లో బదులు తీర్చుకోవాలని బీఆర్ఎస్ అనుకుంటోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని జిల్లాలను కాంగ్రెస్ దాదాపు స్వీప్ చేసింది. అందులో ఖమ్మం ఒకటి. తుమ్మల, పొంగులేటి రాకతో ఇక్కడ కాంగ్రెస్ చాలా బలపడింది. ఖమ్మం లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ సులువుగా గెలిచే అవకాశాలు ఉండేవి. మిత్రపక్షంతో కలిసి ఖమ్మం పరిధిలోని అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీలతో గెలచుకుంది. ఇప్పుడు లోక్ సభకు వచ్చేసరికి ముఖ్యనేతలను సర్దుబాటు చేయలేక.. సామాజిక వర్గాలను సంతృప్తి పరుచలేక బీఆర్ఎస్ కు అడ్వాంటేజీ ఇస్తున్నారు.

కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలువడానికి పలు సామాజిక వర్గాలు కలిసి పనిచేశాయి. ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరడంతో..ఆయన వర్గం కూడా సహకరించింది. సంపద్రాయంగా ఖమ్మం ఎంపీ సీటు కేటాయించే సామాజిక వర్గానికి ఈ సారి సీటు కేటాయించడం లేదు. పోనీ ఇతర చోట్ల అయినా అవకాశం కల్పిస్తున్నారా అంటే అదీ లేదు. ఆ ఒక్క సామాజికవర్గానికే కాదు.. అసలు ఒక్క రెడ్డి వర్గం తప్ప మరో వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకుండా రాజకీయం చేస్తున్నారు.

బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు గడ్డు కాలం అనుకున్నారు. ఆయన డబ్బులు ఖర్చు పెట్టేందుకు కూడా సిద్ధంగా లేరు. సాదాసీదాగా ప్రచారం చేస్తున్నారు. కీలక నేతలు దూరం కావడంతో ఆయనలో కూడా గెలుస్తామన్న నమ్మకం లేకుండేది. అయితే కాంగ్రెస్ చేస్తున్న రాజకీయంతో ఇప్పుడు ఆయనలో ఆశలు చిగురిస్తున్నాయనే చెప్పవచ్చు. రెండు రోజుల్లో ఖమ్మంలో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ సంపూర్ణం అవుతుందని.. అప్పట్నుంచి నామా నాగేశ్వరరావు అసలు రాజకీయం కనిపిస్తుందని బీఆర్ఎస్ నేతలు ధీమా ప్రకటిస్తున్నారు.

TAGS