Chandrababu : తెలంగాణలో చంద్రబాబు మళ్లీ చక్రం తిప్పుతారా.. టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేలా తమ్ముళ్ల స్కెచ్

Chandrababu

Chandrababu

Chandrababu : ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయఢంకా మోగించిన సంగతి తెలిసిందే. అధికారం హస్తగతం కావడంతో పార్టీ క్యాడర్ మాంచి జోష్ లో ఉన్నారు. భూస్థాపితం అయిపోయిందనుకున్న పార్టీకి తిరిగి పునరుత్తేజం రావడంతో నాయకుల ఆనందానికి అవధుల్లేవు. ఇదే క్రమంలో తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేయాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీజేపీకి తోడుగా తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థలు, గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తుందా..?  అందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం తెలంగాణలో కూడా పార్టీ కార్యక్రమాలను జోరుగా నడిపించేందుకు రెడీ అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

ఇందులో భాగంగానే శుక్రవారం చంద్రబాబుకు ఘనస్వాగతం పలుకుతూ హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి పంజాగుట్ట, జూబ్లిహిల్స్ వరకు పసుపు తోరణాలు, స్వాగత ఫ్లెక్సీలతో నింపేశారు. అంతేకాదు నాలుగో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా నగరానికి వస్తున్న సందర్భంగా భారీ బైక్ ర్యాలీ ఏర్పాటు చేశారు తెలంగాణ తెలుగు తమ్ముళ్లు. తెలంగాణ టీడీపీ అధ్యక్ష ఎన్నిక, రాబోయే ఎన్నికల్లో పోటీ, పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన వ్యూహాలపై ఆదివారం జరిగే ఆత్మీయ సమ్మేళనంలో ఆ పార్టీ నేతలు చంద్రబాబుతో చర్చించనున్నారు.

బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబునాయుడు సీఎం హోదాలో తొలిసారి హైదరాబాద్ కు వస్తున్నారు. ఆయనకు ఘనంగా వెల్కమ్ చెప్పేందుకు తెలంగాణ తెలుగుదేశం నాయకులు సిద్ధంగా ఉన్నారు. విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వాల్సిన నిధులు, అందించాల్సిన సహాయ, సహకారంపై చర్చించేందుకు గురువారం ఢిల్లీకి వెళ్లి కేంద్రం పెద్దలను కలిసి తిరిగి హైదరాబాద్ చేరుకోవడంతో తెలుగు తమ్ముళ్లు చంద్రబాబుకు భారీ బైక్ ర్యాలీని ఏర్పాటు చేశారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసం వరకు ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో నింపేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత చంద్రబాబు రెండు రాష్ట్రాలకు విభజన చట్టం ప్రకారం జరగాల్సిన పంపకాలు, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారంపై చొరవ చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతారు.

చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ వెనుక ఆంధ్రా, తెలంగాణకు చెందిన అంశాలతో పాటు పరస్పర సహకారంతో అభివృద్ది చేసుకోవాలనే అజెండాను తెరపైకి తేవడంతో ఇప్పుడు తెలంగాణ టీడీపీ నేతలు కూడా ఆయన నిర్ణయాన్ని, ఆలోచనను స్వాగతిస్తున్నారు. అందుకే గతంలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న ముద్దగొని అరవింద్ కుమార్ గౌడ్ నేతృత్వంలో చంద్రబాబుకు స్వాగత ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో టీడీపీ క్యాడర్ ఇంకా బలంగానే ఉంది. చంద్రబాబుపై ఇక్కడి నాయకులకు విశ్వాసం ఉంది. అందుకే ఆయన రాకను స్వాగతిస్తూ నిజం గెలిచిందంటూ భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు.

TAGS