Babu Meet with Modi : బీజేపీతో చంద్రబాబు కలుస్తారా? ‘లెక్క’ మార్చేనా..!!
Babu meet with Modi : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తుల అంశం కీలక దశకు చేరుకుంటుంది. టీడీపీ+జనసేన, బీజేపీతో కలిసి వెళ్లే వ్యూహంలో మరో ముందడుగు పడింది. ఢిల్లీ పర్యటనలో అమిత్ షాతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ సమయంలో బీజేపీ అధికంగా సీట్లు కోరే అవకాశం కనిపిస్తుంది. చంద్రబాబు బీజేపీ సీనియర్లతో సమావేశం అయ్యారు. పార్టీకి మేలైతేనే పొత్తు ఉంటుందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
పొత్తులు లెక్కలు..
సీట్ల కేటాయింపు పై టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు మంతనాలు చేశారు. 2009లో బీజేపీకి ఎక్కువ సీట్లు కేటాయించి నష్టపోయామని వారు చంద్రబాబుకు గుర్తు చేశారు. ఇప్పటికే జనసేనతో పొత్తు కారణంగా 25 నుంచి 30 సీట్లు కోల్పోతున్నామని.. బీజేపీ కోరిక మేరకు పెద్ద సంఖ్యలో సీట్లు కేటాయిస్తే పార్టీలో వ్యతిరేకత వస్తుందనే అభిప్రాయం వ్యక్తమైంది. బీజేపీకి 3 ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీకి స్థానాలకు మాత్రమే పరిమితం కావాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
చంద్రబాబు మంతనాలు
అటు బీజేపీ మాత్ర 6 నుంచి 8 ఎంపీ స్థానాలు, 25 వరకు అసెంబ్లీ ఇవ్వాలని కోరుతోంది. దీనిపై ఈ రోజు చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లు సాధించాలనే లక్ష్యంతో పని చేస్తుంది. పార్లమెంట్ లో ప్రధాని సైతం బీజేపీకి 370, మిత్రపక్షాలతో కలిపి 400 సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇందులో భాగంగా దక్షిణాదిన జేడీఎస్, టీడీపీ+జనసేనతో కలిసి వెళ్లాలనే ఆలోచనలో ఉంది బీజేపీ. ఎమ్మెల్యే స్థానాలు తగ్గినా.. ఎంపీ స్థానాలు 6 నుంచి 8 ఇవ్వాలని బీజేపీ ప్రతిపాదన చేసినట్లు సమాచారం. టీడీపీ నాయకుడు కంభంపాటి రామ్మోహన్, టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఎంపీ సీఎం రమేశ్ ఇదే అంశంపై అమిత్ షాతో మంతనాలు చేశారు.
బీజేపీకి ఇచ్చే సీట్లెన్ని..
చంద్రబాబు భేటీలో అమిత్ షా నుంచి వచ్చే ప్రతిపాదనపై ఎలా స్పందిస్తారనేది పొత్తులో కీలకంగా మారనుంది. బీజేపీ తమ ప్రతిపాదనలో కీలక స్థానాలను మెన్షన్ చేసింది. వీటిని వదులుకుంటే భవిష్యత్ లో పార్టీ భారీగా నష్టపోతుందని టీడీపీ సీనియర్లు అభిప్రాయం వ్యక్తం చేయగా.. వారి వాదనతో చంద్రబాబు ఏకీభవించారు. బీజేపీతో పొత్తు కొన్ని వర్గాలను పార్టీ నుంచి దూరం చేస్తుందనే చర్చ కూడా వచ్చింది. అయితే, ఎన్నికల వేళ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మద్దతు అవసరమని చంద్రబాబు నచ్చజెప్పినట్లు తెలుస్తోంది.
బీజేపీతో పొత్తుకు 10 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైందని పార్టీ నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు బీజేపీ సిద్ధమేనా పొత్తు ఖాయం అవుతుందా? లేదా అనే ఉత్కంఠ మొదలైంది.