Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ను బీజేపీ మళ్లీ ఉపయోగించుకోనుందా..? ఈ సారి ఏం చేయబోతోందంటే?
Pawan Kalyan : భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)లో భాగంగా ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఉంది. బీజేపీతో చేతులు కలిపిన తర్వాత పవన్ ను ఆ పార్టీ కొన్ని సందర్భాల్లో ఎన్నికల ప్రచారానికి వాడుకుంది. లోక్ సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్, రాయచూర్ లలో బీజేపీ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. అంతకు ముందు ఆయన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు.
వచ్చే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పవన్ సాయం తీసుకోవాలని బీజేపీ నిర్ణయించింది. తాజా సమాచారం ప్రకారం నవంబర్ 16, 17 తేదీల్లో మహారాష్ట్రలో ఎన్డీయే (బీజేపీ, షిండే శివసేన, ఎన్సీపీ) తరఫున పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నారు. ఆయన పర్యటించే ప్రదేశాలను త్వరలోనే బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది. మహారాష్ట్రలో పార్టీ తరఫున ప్రచారం చేయాలని కేంద్ర హోంమం త్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పవన్ ను కోరినట్లు సమాచారం.
బీజేపీ అధిష్ఠానంతో సాన్నిహిత్యం, సనాతన ధర్మంపై ఆయన చేసిన బలమైన ప్రకటనల కారణంగా పవన్ కల్యాణ్ ఇటీవల జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకున్నారు. తాజాగా తిరుపతి లడ్డూ వివాదం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ అయ్యాయి. పవన్ ఇటీవలి రాజకీయ ప్రాధాన్యత, సినీ తారగా ఆయనకున్న ప్రజాదరణ ఎన్నికల్లో పార్టీకి ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది. మహారాష్ట్రలో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.