BJP Alliance BRS : బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే బీజేపీ మనుగడ ప్రశ్నార్థకమే?

BJP Alliance BRS

BJP Alliance BRS

BJP Alliance BRS : 2024 పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో పార్టీల్లో అప్పుడే ప్రచారం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేసిన పొరపాటు కాంగ్రెస్ కు వరంగా మారింది. మునిగిపోతున్న కాంగ్రెస్ కు జవసత్వాలు నింపింది బీజేపీనే. తాను చేసిన తప్పిదం వల్లే కాంగ్రెస్ కు అధికారం సాధ్యమైందనే విషయం అందరికి తెలుసు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను మార్చడం ఆ పార్టీ మునిగిపోవడానికి కారణంగా నిలిచింది. బండి సంజయ్ ని అసెంబ్లీ ఎన్నికల వరకు అధ్యక్షుడిగా ఉంచితే ఫలితాలు వేరేలా ఉండేవి. ఈ విషయం అందరికి అర్థమైంది. కొందరి రాజకీయ కుట్రలకు సంజయ్ ని బలి చేసి పార్టీ భారీ నష్టాన్ని మూట గట్టుకుంది.

ఇప్పుడు బీఆర్ఎస్ బలహీనంగా ఉంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను మరింత దెబ్బకొడితే కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే కావొచ్చు. గతంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా నిలిచిన బీజేపీని కావాలనే కిందికి తోసేశారు. దీనికి కారణం ఎవరో కూడా అందరికి తెలుసు. అలా తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంది. తెలంగాణలో అధికారంలోకి రావాలనే కలను దూరం చేసుకుంది. దక్షిణాదిలో పట్టు సాధించాలనే ఆశలను వమ్ము చేసుకుంది.

ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందనే ఆలోచన కేటీఆర్ తండ్రికి సూచించారు. కానీ కేసీఆర్ మాత్రం ఇన్నాళ్లు బీజేపీని బండ బూతులు తిట్టి ఇప్పుడు వారితో పొత్తు అంటే మన మొహం మీద ఉమ్మెస్తారనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనల్ని గట్టెక్కించేది బీజేపీ ఒక్కటే. లేకపోతే బీఆర్ఎస్ మనుగడ దెబ్బతింటుంది. పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందనే వాదన కేటీఆర్ తెస్తున్నారని సమాచారం.

ఇప్పుడు బీజేపీకి మంచి అవకాశం దక్కింది. బీఆర్ఎస్ ను నామరూపాల్లేకుండా చేస్తే ఇక కాంగ్రెస్ ను ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. కాంగ్రెస్ లో ఐకమత్యం తక్కువ. ఒకరి మీద మరొకరు బురద జల్లుకోవడం మామూలే. అలాంటి పార్టీని నిలువరించడం సులభమే. కానీ బీఆర్ఎస్ తో దోస్తీ కడితే మాత్రం దానికే మేలు కలుగుతుంది. ఇప్పుడు వారి మదిలో ఉన్న ఆలోచన అదే.

అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ను రక్షించడానికే బండి సంజయ్ ను మార్చారనే అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తే బీఆర్ఎస్ బలపడుతుంది. బీజేపీ బలహీనంగా మారుతుంది. అలాంటి తప్పు చేయకుండా బీఆర్ఎస్ ను దెబ్బతీయాలంటే బీజేపీ ఒంటరిపోరాటం చేయడమే సరైన మార్గం. ఒకవేళ ప్రలోభాలకు లొంగితే బీజేపీ పుట్టి మునగడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

TAGS