Patnam Narender Reddy : పట్నం నరేందర్ రెడ్డిని ఎందుకలా అరెస్టు చేశారు?: హైకోర్టు
Patnam Narender Reddy : కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు విధానాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. కేబీఆర్ పార్కు వద్ద వాకింగ్ కు వెళ్లినప్పుడు ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించింది. మాజీ ఎమ్మెల్యేను ఓ ఉగ్రవాదిలాగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని నిలదీసింది. నరేందర్ రెడ్డి పరారీలో ఉన్నారా అని పీపీని ప్రశ్నించింది. దాడికి గురైన అధికారుల గాయాలపై సరిగ్గా నివేదించలేదని హైకోర్టు పేర్కొంది. తీవ్రగాయాలైనట్లు రిపోర్టు ఇచ్చి, చిన్న గాయాలైనట్లు రాశారని చెప్పింది. నరేందర్ రెడ్డి అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదని ఉన్నత న్యాయస్థానం ఆక్షేపించింది.
మరోవైపు ప్రజలను రెచ్చగొట్టేలా నరేందర్ రెడ్డి మాట్లాడారని పీపీ తెలిపారు. ఈ దశలో పిటిషన్ ను అనుమతిస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుందన్నారు. రిమాండ్ ఆర్డర్ ను క్వాష్ చేయాలన్న నరేందర్ రెడ్డి పిటిషన్ ను కొట్టివేయాలని కోరారు. రిమాండ్ ఆర్డర్ క్వాష్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. నరేందర్ రెడ్డి పాత్రపై నమోదు చేసిన వాంగ్మూలాలు ఇవ్వాలని పీపీని ఆదేశించింది.