
Sharad Pawar : ‘ఎమర్జెన్సీ’ అంశంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చేసిన వ్యాఖ్యలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ స్పందించారు. స్థాయికి తగినట్లు ఆయన సభలో మాట్లాడలేదని విమర్శలు గుప్పించారు. శనివారం విలేకరుల సమావేశంలో పవార్ పాల్గొని మాట్లాడారు. లోక్ సభ స్పీకర్ పదవిలో ఉన్న ఓం బిర్లా అసందర్భంగా ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించడం ఏమాత్రం తగదని అన్నారు. ఆ చీకటి ఆధ్యాయం ముగిసి 50 ఏళ్లు కావస్తోంది. ప్రస్తుతం ఈ అంశాన్ని తెర మీదకు ఎందుకు తీసుకువస్తున్నారు. రాజకీయంగా ఇలాంటి ప్రకటనలు చేయడం స్పీకర్ విధుల్లో భాగమా? అని ప్రశ్నించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని శరద్ పవార్ పేర్కొన్నారు.
లోక్ సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని ఎన్నుకోవడాన్ని పవార్ స్వాగతించారు. రాహుల్ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలరంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, మహారాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టడంపై శరద్ పవార్ తీవ్ర విమర్శలు చేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నమని అన్నారు.