Revanth Reddy:అందుకే భట్టికి రేవంత్ రెడ్డి అంత ప్రాధాన్యతనిస్తున్నారా?
Revanth Reddy:తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తరువాత తొలి సారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. అయితే ఇంత వరకు ఏ సీఎం కూడా వ్యవహరించని విధంగా రేవంత్‌రెడ్డి తనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కూడా వెంట తీసుకెళ్లారు. ప్రధాని మోదీతో ఈ ఇద్దరు నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం కోసమే మొదటి సారి మోదీని కలిశామని భేటీ అనంతరం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ `పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం కోసం విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన అనేక హామీలని ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ విభజన చట్టంలోని హామీల విషయంలో గత ప్రభుత్వం తాత్సారం చేసింది. విభజన హామీలను త్వరితగతిన పరిష్కరించాలని కోరాం. బయ్యారంలో ఉక్కుపరిశ్రమ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశాం.
తెలంగాణలో ఒక ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. అందులో భాగంగా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కోరాం. ఐఐఎం, సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని అడిగాం. నేషనల్ హైవే అథారిటీకి సంబంధించి 14 ప్రపోజల్స్ అప్‌గ్రేడ్ కోసం పెండింగ్‌లో ఉన్నాయని వెంటనే మంజూరు చేయాలని కోరామన్నారు. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ టూర్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
ముందు నుంచి ముఖ్యమంత్రి స్థానం తనదేనంటూ పోటీపడిన భట్టి విక్రమార్కను ఎందులోనూ తక్కువ చేయకూడదని, ప్రతి విషయంలోనూ ఆయనకు ప్రధాన్యతన ఇస్తున్నారనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా భట్టికి ఎక్క్డ తక్కువ చేసినా ఇబ్బంది తలెత్తేది భట్టి నుంచే కాబట్టి రేవంత్ రెడ్డి ముందు జాగ్రత్తలో భాగంగానే ఆయనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారట. ఇందుకు ప్రగతిభవన్‌ని తనకు నివాసంగా ఉపయోగించకుండా భట్టికి కేటాయించారని, ఇక తొలి సారి ప్రధానని కలవడం కోసం ఢిల్లీ పర్యటనకు కూడా భట్టిని వెంటబెట్టుకెళ్లారని రాజకీయ విశ్లేషకులు కామెంట్‌లు చేస్తున్నారు.