KCR – Jagan : ప్రతి పక్షంలో కూర్చునేందుకు కేసీఆర్, జగన్ ఎందుకు ఇష్టపడరు?
KCR – Jagan : ప్రజాస్వామ్యంలో ప్రజలకు అధికార పక్షం ఎంత మేలు చేస్తుందో.. ప్రతి పక్షం అంతకంటే ఎక్కువే చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే పాలకుల్లో స్వార్థం నిండినప్పుడు, పథకాలు సరైన రీతిలో అమలు కానప్పుడు, సామాన్యుడు ఆపన్న హస్తం కోసం ప్రభుత్వం వైపు ధీనంగా చూస్తున్నప్పుడు ప్రతిపక్షమే వారివైపు నిలబడాలి. ప్రతిపక్షం ఎంత బలంగా ఉంటే పాలక పక్షం అంత బాగా పని చేస్తుంది. ఇదే ప్రజాస్వామ్యంలో అందం. ఒక్క మాటలో చెప్పుకుంటే అధికార పక్షాన్ని పరుగులు పెట్టించేది ప్రతిపక్షమే.
అయితే, ప్రతిపక్షం ఆ పాత్రను పోషించడంతో విఫలం అవుతూనే ఉంది. అందుకే ప్రజలకు కూడా ప్రతిపక్షపై నమ్మకం పోతోంది. పైగా ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన వారు తమకేంటి లాభం అంటూ పాలక పక్షంతో కలుస్తున్నారు. దీని ద్వారా బలమైన పాలక పక్షం ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారవుతుంది. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరు నెలల వ్యవధిలో అధికారం కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. ఇప్పుడు వీరిద్దరు కూడా ప్రతిపక్షంలో కూర్చోలేకపోతున్నారు.
అహం అడ్డొస్తోంది..
తెలంగాణలో కేసీఆర్ పదేళ్లు సీఎంగా పనిచేశారు. విపక్షం అనేది ఉండొద్దు అన్నట్లు వ్యవహరించారు. ఇతర పార్టీల్లోని ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. తనకు ఎదురు చెప్పేవారు.. ప్రశ్నించేవారు ఉండద్దని వచ్చిన వారిని వచ్చినట్లు కలుపుకున్నారు. ప్రతిపక్షం అంటే పాలక పక్షాన్ని ప్రశ్నించడం.. అదే కేసీఆర్‌కు నచ్చనిది. అందుకే బీఆర్ఎస్ ప్రతిపక్షమైన కాంగ్రెస్ నేతలను నయానో, భయానో తన పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలు గడిచినా.. ప్రతిపక్ష నేత స్థానంలో కూర్చునేందుకు కేసీఆర్‌కు అహం అడ్డు వస్తోంది. ఇప్పటి వరకు 2 సార్లు సభ నిర్వహించినా కేసీఆర్ విపక్ష స్థానంలో కూర్చోవడం ఇష్టం లేక సభకు రాలేదు.
బీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా..
39 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ ప్రతిపక్షం హోదాను దక్కించుకుంది. కేసీఆర్ అసెంబ్లీకి రాడని తెలిసినా తమ పార్టీ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ నే ఎన్నుకున్నారు ఆ పార్టీ నేతలు. కానీ, అసెంబ్లీ సమావేశాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. దీంతో కేటీఆర్, హరీశ్‌రావే అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తున్నారు.
రేవంత్ ముందు తలెత్తుకోలేక..
తక్కువ కాలంలోనే రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇది కేసీఆర్ కు మింగుడు పడడం లేదు. తాను ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు రేవంత్ టీడీపీలో ఉన్నాడు. నాడు ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి ఉన్నారు. ఈ కేసులో రేవంత్ ను జైలులో పెట్టారు. ఇప్పుడు సీఎం హోదాలో ఉన్న రేవంత్ ఎదుట విపక్ష నేతగా కూర్చోవడానికి కేసీఆర్ ఇష్టపడడం లేదు.
జగన్ ఘోర పరాభవం..
ఇక ఏపీలో 2019లో 151 సీట్లు గెలుచుకొని అధికారం చెలాయించిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇప్పుడు 11 సీట్లకే పరిమితమయ్యారు. ‘వైనాట్ 175’తో జగన్ సారథ్యంలో బరిలోకి దిగిన వైసీపీని ఆంధ్రా ఓటర్లు 11 అసెంబ్లీ, 4 లోక్‌సభ స్థానాలకే పరిమితం చేశారు. ఇది జగన్‌కు మింగుడు పడడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ తో పాటు పలువురు సీనియర్ నేతలను జగన్ సర్కార్ వేధించింది. అసెంబ్లీ సాక్షిగా జగన్ విపక్ష నేత చంద్రబాబును తీవ్రంగా అవమానించారు. ఆయన సతీమణిపై వైసీపీ నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును స్కిల్ స్కాం కేసులో జైలులో పెట్టారు. వీటి ప్రభావం ఎన్నికల్లో కనిపించింది.
బాబు ముందు కూర్చోలేక..
విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ విపక్షానికి పరిమితమైంది. 2014లో 67 స్థానాల్లో గెలిచి విపక్షంగా కీలక పాత్ర పోషించింది. జగన్ కు కూడా అసెంబ్లీ సమావేశాలపై అనుభవం వచ్చింది. 2019లో ఒక్క ఛాన్స్ అంటూ ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్లు ఇచ్చారు. దీంతో అధికారంలోకి వచ్చిన జగన్.. ఎలాంటి అభివృద్ధి చేయలేదు. అమరావతి రాజధానిని రద్దు చేసి మూడు రాజధానుల విషయం తెరపైకి తెచ్చారు. ఫలితంగా 11 స్థానాలు దక్కాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు ముందు కూర్చొనే పరిస్థితి లేకుండా పోయింది జగన్ కు.
అడ్డం వస్తున్న ఈగో..
2014 నుంచి 2019 వరకు విపక్షంలో కూర్చున్న జగన్ కు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. దీంతో అసెంబ్లీలో కూర్చునేందుకు ఆయనకు ఇగో అడ్డొస్తోంది. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్‌కు లేఖ రాశారు. దీనిపై స్పీకర్ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో ఆయన కూడా అసెంబ్లీకి వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.