YS Jagan : సభా మర్యాదను పాటించని ప్రతిపక్ష హోదా దేనికి?
YS Jagan : ఆంధ్రప్రదేశ్ కు ‘ప్రత్యేక హోదా’ దక్కకపోయినా ఆ పేరుతో రాజకీయాలు చేసేందుకు అన్ని పార్టీలకు సమాన అవకాశాలు లభిస్తూనే ఉన్నాయి. ప్రత్యేక హోదా (స్పెషల్ స్టేటస్) అనేది జమ్మి చెట్టు మీద దాచిన పాండవుల దివ్యాస్త్రాల లాంటివి. కనుక వాటిని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసి వాడుకోవచ్చని మొన్న షర్మిల, ఇప్పుడు జగన్ నిరూపిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే, రాష్ట్రంలో అన్ని పార్టీలు కలిసి ‘ప్రత్యేక హోదా’ను ఎవరికీ అంతుపట్టని ఓ బ్రహ్మ పదార్థంగా మార్చేసి వాడుకుంటున్నందున, ఆ పేరుతో అవి చేసే రాజకీయాలను కూడా ప్రజలు పట్టించుకోవడం ఇప్పటికే మానేశారు. అది వేరే సంగతి.
అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు షర్మిల ప్రతి రోజూ ప్రత్యేక హోదా గురించే మాట్లాడుతూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే.., అన్న జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టేవారు. అప్పుడు జగన్ దాని గురించి మాట్లాడేవారు కారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినప్పటి నుంచి జగన్ ప్రత్యేక హోదా అంశాన్ని మళ్లీ ముందేసుకొని మాట్లాడుతుంటే షర్మిల సైలంట్ అయ్యారు.!
‘నాకు 25 మంది ఎంపీలను ఇస్తే మోడీ మెడ వంచి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువస్తా’ అని ప్రగల్భాలు పలికిన జగన్, 23 మంది ఎంపీలు ఉన్నా గత ఐదేళ్లు దాని గురించి ఎందుకు మాట్లాడలేదు..? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే మోడీ ప్రభుత్వానికి టీడీపీ మద్దతు కీలకం కానుంది కనుక, ప్రధానిని బలవంతంగా ఒప్పించి ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలని జగన్ ఉచిత సలహా ఇస్తున్నారు.
కానీ ప్రత్యేక హోదా లాంటిది కాదు ‘ప్రతిపక్ష హోదా’. ఇప్పుడు వాడుకోకపోతే ఎప్పటికీ వాడుకునే అవకాశం రాదు. కనుక జగన్ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఓ లేఖ రాశారు. అయితే అంతమాత్రన్న తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇమ్మనమని కాదు. ఈ పేరుతో ఎంతో కొంత రాజకీయ మైలేజ్ పొందాలనే తాపత్రయమే. అందుకే స్పీకర్‌కు రాసిన ఆ లేఖ కాపీనీ ట్విట్టర్‌లో కూడా పోస్ట్ చేశారు.
ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు @ysjagan లేఖ!
మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించడం పద్ధతులకు విరుద్ధం ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్టు ఉన్నారు విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉంది ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే… pic.twitter.com/fNK1dXaWCg
— YSR Congress Party (@YSRCParty) June 25, 2024
అయితే జగన్ మొన్న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, మర్నాడు అయ్యన్న పాత్రుడిని స్పీకర్‌గా ఎన్నుకున్నప్పుడు సభకు హాజరై అడిగినా అర్థం ఉండేది. కానీ సభను గౌరవిస్తానని, నిబంధనలకు కట్టుబడి ఉంటానని ప్రమాణం చేసి 24 గంటలు కాక ముందే ప్రమాణాన్ని ఉల్లంఘించి పులివెందుల వెళ్లిన జగన్మోహన్ రెడ్డి, అక్కడో మూడు రోజులు గడిపి అక్కడి నుంచి బెంగళూర్ వెళ్లిపోయి, అక్కడి నుంచి రూల్స్ మాట్లాడుతూ లేఖ రాయడం విడ్డూరంగానే ఉంది?
అయినా ‘సభలో మనకి పనిలేదని’ చెప్పి వెళ్లిపోయినప్పుడు ఆ ఎమ్మెల్యే పదవి కూడా అనవసరం కదా..? ఇక ప్రతిపక్ష నేత హోదా మాత్రం దేనికి..? పోనీ ఇస్తానంటే సభా సమావేశాలకు వస్తానని మాట ఇవ్వగలరా..?