Pawan Kalyan : పవన్ ఎంపీగా పోటీ చేస్తున్నారనే వార్తలు ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎమ్మెల్యేగా పోటీ చేసి డిప్యూటీ సీఎం పదవో, కీలక మంత్రి పదవో చేపడుతారని ఆశించిన జనసైనికులకు ఈ వార్త అసలే మింగుడు పడడం లేదు. జనసైనికుల లక్ష్యమే పవన్ సీఎం కావడం, ఏపీ రాజకీయాలను శాసించడం. కానీ పవన్ రాష్ట్రాన్ని వదిలి పార్లమెంట్ కు వెళ్తే రాజకీయ ప్రాధాన్యం కోల్పోతారని వారు ఆవేదన చెందుతున్నారు.
జనసైనికుల పరిస్థితి ఇలా ఉంటే సామాన్య ప్రజలు, ప్రత్యర్థి పార్టీల నుంచి పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి రాలేమని నిర్ణయానికి వచ్చారు గనుకే పవన్ ఎంపీగా పోటీ చేసి ఢిల్లీకి వెళ్దామని డిసైడ్ అయ్యారని వైసీపీ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. అలాగే పవన్ ఎన్నో సభల్లో ప్రజలకు ఇచ్చిన హామీలకు ఎవరు బాధ్యత వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆయనను చూసి కూటమికి ఓటేస్తే ఆయన పార్లమెంట్ కు వెళ్లిపోతే ఆ హామీల అమలు సంగతేంటి అని అంటున్నారు.
పవన్ పార్లమెంట్ కు వెళ్లిపోయి రాష్ట్ర అధికారంలో వాటా లేకపోతే.. జనసైనికులు, కాపు వర్గం చంద్రబాబును గెలిపించాలా? తమ ఇన్ని రోజులు కలలు కన్నది చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికా అని సదరు వర్గాలు ఆవేదన పడుతున్నాయి. తమ వర్గం నుంచి ఒకరు కీలక పదవిలో ఉండాలని ఆశిస్తే..పవన్ చేసేది ఇలా ఉందంటూ సీనియర్ నేతలు ఆవేదన పడుతున్నారు.
ఇదిలా ఉండే చంద్రబాబు కూడా కూటమి తరపున ఎన్నో హామీలు ఇస్తున్నారు. మరి వీటి అమలును ఎవరు అడుగుతారు. పవన్ వెళ్లి పార్లమెంట్ లో కూర్చుంటే రాష్ట్ర రాజకీయాలపై పట్టు పోవడమే కాదు, కూటమి హామీలను ప్రశ్నించే పరిస్థితి కూడా ఉండదు. రాష్ట్ర రాజకీయాలపై పట్టు కోల్పోతే పార్టీ భవిష్యత్ ను కూడా కాపాడుకోలేం. ఇప్పటికే పార్టీ పదేళ్లు అవుతున్నా..ఏమాత్రం ప్రభావం చూపకుండా ఉంది. కనీసం పొత్తు ద్వారా అధికారంలో వాటా పొందితే రాబోయే ఎన్నికల వరకైనా పార్టీని కొద్దిగా విస్తరించుకోవచ్చు. కానీ పవన్ పార్లమెంట్ కు వెళ్లిపోతే ఇవన్నీ జరగడం అసాధ్యం. సొంత పార్టీ, సొంత సామాజికవర్గం నుంచి పవన్ నిర్ణయంపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై పవన్ పునరాలోచించుకుంటేనే మంచిది లేకపోతే జనసేన భవిష్యత్ కే పెను ప్రమాదమని విశ్లేషకులు భావిస్తున్నారు.