CM Revanth : ఓ వైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మోడీతో, కేంద్ర ప్రభుత్వంతో దౌత్య సంబంధాల కోసం ఆరట పడుతూనే ఎన్నికల విషయం వచ్చే సరికి బీజేపీతో బిగ్ ఫైట్ కు దిగుతున్నారు. బీజేపీ ముఖ్యనేత, ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవలి కాలంలో మోదీ, బీజేపీల స్వార్థ పూరిత రాజకీయ ఎత్తుగడలపై రేవంత్ ప్రశ్నించారు.
లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400+ సీట్లు గెలుచుకుంటుందని ఒక రోజు మోడీ చెప్పారని, మరుసటి రోజు ప్రాంతీయ పార్టీలను ఎన్డీయేలోకి ఆహ్వానించే ప్రతిపాదనతో ముందుకు వెళ్తారని, మోడీకి 400 సీట్లు గెలుస్తామన్న నమ్మకం ఉంటే ఏపీలో చంద్రబాబు, కర్ణాటకలో జేడీఎస్, ఒడిశాలో పట్నాయక్ ను ఎందుకు బీజేపీలోకి కలుపుకుంటున్నారని రేవంత్ వివిధ సభలు, విలేకరుల సమావేశంలో ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా జనసేనతో కలిసి తెలుగుదేశం ఎన్డీయేలో చేరిన తర్వాత ఏపీలో పొత్తు కోసం చంద్రబాబు వెంట మోడీ వెళ్తున్నారని రేవంత్ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఎన్డీయే 400 సీట్లు గెలుచుకుంటుందని, కానీ పొత్తుల కోసం ప్రాంతీయ పార్టీల వెంట వెళ్తుందని మోడీ నీచమైన రాజకీయ వాదనలు బట్టబయలవుతున్నాయని తెలంగాణ సీఎం అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతున్నదన్న రేవంత్ రెడ్డి రాహుల్ ను ప్రధాని చేస్తామని చెప్తున్నారు. దీంతో ఇన్నాళ్లు రేవంత్ బీజేపీకి దగ్గరని విమర్శలు గుప్పిస్తున్న బీఆర్ఎస్ కు చెంపపెట్టులా మారిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.