Chandrababu : విజయంపై చంద్రబాబు అంత నమ్మకమెందుకు? కారణాలు ఇవేనా..
Chandrababu : ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈసారి తమదే పక్కా విజయమని వైసీపీ, టీడీపీ-జనసేన కూటమి నమ్మకంగా ఉన్నాయి. జగన్ తన అభ్యర్థులను చాలామందిని ఇప్పటికే ప్రకటించారు. 175 సీట్లలో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నారు.
ఆయన నమ్మకానికి గల కారణాలు విశ్లేషిస్తే.. టీడీపీ, జనసేన పొత్తుతో కూటమికే విజయావకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పొత్తు ద్వారా కాపుల ఓట్లు మొత్తం కూటమికే పడుతాయి. దీంతో రెండు జిల్లాల్లో వైసీపీని దాదాపు తుడిచిపెట్టే అవకాశం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో దాదాపు 80 శాతం సీట్లు కూటమికే దక్కుతాయనే భరోసాతో ఉన్నారు. మిగతా జిల్లాల్లో కూడా టీడీపీ, జనసేన ఓట్ల శాతం.. వైసీపీ కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి తద్వారా అధికారం పక్కా అని చంద్రబాబు కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఇక సంక్షేమ పథకాల పేరుతో గత ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చారు. పేద, మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకోవాలంటే సంక్షేమ పథకాలు ప్రకటించడం తప్పనిసరి. జగన్ కంటే ఎక్కువ మొత్తంలో, మరింత జనరంజకమైన సంక్షేమ పథకాలను టీడీపీ, జనసేన కూటమి ప్రకటించబోతోంది. దీని ద్వారా జగన్ కు పడే ఓట్లు కూటమి వైపు పడే అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు ఆలోచన. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి కొత్త తరహా పథకాలను ప్రకటనతో మహిళల ఓట్లు గంపగుత్తగా పడే అవకాశం ఉందని భరోసాగా ఉన్నారు.
అలాగే కమ్యూనిస్టు పార్టీలు, బీజేపీ ఓటర్లు, తటస్థులు కూడా కూటమి వైపే మొగ్గే అవకాశాలు కనపడుతున్నాయని చంద్రబాబు నమ్మకంగా ఉన్నారు. జగన్ పాలనలో రాష్ట్రానికి ఒక్క కంపెనీ రాలేదని, ఉపాధి కల్పన లేక యువత పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారని, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అంతంత మాత్రంగానే రిక్రూట్ చేస్తుండడంతో.. అందరి ఓట్లు టీడీపీ, జనసేన కూటమికే షిఫ్ట్ అవుతాయని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. ఈ వర్గాల ఓట్ల ద్వారా విజయం సాధించడం కష్టమేమి కాదని చంద్రబాబు నమ్ముతున్నారు.