Abhinava Apparao : ‘అభినవ అప్పారావులు’’ అంటూ కేసీఆర్, రేవంత్ రెడ్డి గురించి ఎందుకు రాయరు?
Abhinava Apparao : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను మీడియా సంస్థలు శాసిస్తున్నాయి. 1980ల వరకు పత్రికలు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండేవి. ఎప్పుడైతే ఒక వర్గానికి వ్యతిరేకంగా మరో వర్గం నుంచి సీఎం అభ్యర్థిగా సినీ నటుడిని ప్రమోట్ చేయడానికి ఓ పత్రిక కంకణం కట్టుకుంది. కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేసి..ప్రజల్లో విపరీతమైన అభిమానం ఉన్న నటుడిని సీఎం చేయగలిగింది. ఆ తర్వాత ఆయన ఆ పత్రికాధిపతి మాట వినకపోయేసరికి తన చెప్పుచేతల్లో ఉండే ఓ నేతకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి సదరు సీఎంను గద్దెదించేశారు. తమ చెప్పు చేతల్లో ఉండే ఆ నాయకుడిని ఇప్పటివరకూ ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు.
ఆ పత్రిక ఎవరో, ఆ సీఎం ఎవరో, ఆ నాయకుడు ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి అధినేతలు ఇద్దరూ ఇప్పటికీ రాష్ట్రంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరూ పాలనలోకి రాకుండా చూసుకునే పనిని దగ్గరుండి మరీ చేస్తుంటారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సైతం చంద్రబాబుకు అడ్డురాకుండా చూడడానికి ఫ్యాక్షనిస్టుగా, అవినీతి పరుడిగా తమ పత్రికల్లో చిత్రీకరించేవారు.
అయినా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి సీఎం అయ్యారు. ఈ టర్మ్ లో వైఎస్ పాలన తీరు సామాన్య జనాలను ఎంతగానో ఆకట్టుకుంది. పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. 2009 ఎన్నికల్లో సైతం రాజశేఖర్ రెడ్డి గెలవకుండా చేయడానికి సదరు పత్రికలు చేయని పత్రికలు లేవు. అయినా ఆ ఎన్నికల్లోనూ వైఎస్ గెలిచారు. ఇక ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ మనకు తెలిసినవే.
ఇక ప్రస్తుతం చంద్రబాబును అధికారంలోకి రాకుండా అడ్డుకుంటున్న జగన్ పై కూడా అదే అక్కసు వెళ్లగక్కుతున్నాయి ఈ పత్రికలు. సీఎం జగన్ అప్పులు చేసి బటన్లు నొక్కుతున్నారని రాతలు రాస్తున్నాయి. అభినవ అప్పుల అప్పారావు అంటూ ప్రత్యేక కథనాలు వండివారుస్తున్నాయి. అయితే గతంలో కేసీఆర్ కూడా తెలంగాణలో అప్పులు చేసి పాలించారు. ఇదే విషయాన్ని అప్పటి ప్రతిపక్షాలు రోజూ మొత్తుకునేవి. అయినా కూడా ఈ పత్రికలు ఏ రోజూ కేసీఆర్ కు వ్యతిరేకంగా రాయలేదు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా అప్పుల పాలనే చేస్తున్నారు.
మరి వీటిపై రాయని సదరు పత్రికలు ఒక్క జగన్ పైనే విరుచుకుపడడం గమనార్హం. ఎందుకంటే కేసీఆర్ అంటే వారికి వణుకు, ఇక రేవంత్ రెడ్డి అంటే తమ శిష్యుడే..కానీ జగన్ అలా కాదు కదా.. వారి మాట వినని మొండోడు కదా. తమ చెప్పుచేతల్లో ఉండని నాయకుడు కాబట్టి జగన్ వ్యాపారాలపై, జగన్ కుటుంబంపై, జగన్ ప్రభుత్వంపై ఆ పత్రికలు ఇష్టారీతిన విష ప్రచారం చేస్తున్నాయి.
పాత్రికేయ విలువలు పాటిస్తున్నాయా లేదా అనేది వేరే విషయం. రాజకీయాలను శాసించాలన్నా కోరిక పత్రిక యాజమాన్యాలకు ఎందుకు ఉండాలి. పత్రికలు అంటే ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూడడం. అలాగే కుల,మత, వర్గ వైరుధ్యాలు లేకుండా నిష్పక్షపాత వార్తలు ప్రచురించడం. ప్రభుత్వ పాలనలో అవినీతిని, ఆలస్యాన్ని ప్రశ్నించడం సబబే. కానీ అంతకుమించి రాజకీయ బాధ్యతలు మీద వేసుకోవడమే అసలు సమస్య.