IPL 2024 : ఐపీఎల్-2024 యమ రంజుగా సాగుతోంది. చాలా మ్యాచ్ లు ఫైనల్ ఓవర్ వరకు వెళ్తుండడంతో క్రికెట్ ఫ్యాన్స్ సీట్లలో నుంచి లేచి మునివేళ్లపై నిలబడి మ్యాచ్ లు చూస్తున్నారు. స్టేడియంలో ఉన్న అభిమానులు మాత్రమే కాదు బయట ఫోన్లు, టీవీల్లో కూడా కోట్లాది మంది ఆడియన్స్ మ్యాచ్ లను లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఫ్రీగా స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉండడంతో జియో సినిమా యాప్ లో మ్యాచ్ లు చూసే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఆటగాళ్ల ధనాధన్ బ్యాటింగ్ విన్యాసాలు, మెరుపు ఫీల్డింగ్, అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనలను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. అయితే సరిగ్గా గమనిస్తే ఈ సారి నాలుగు టీముల మ్యాచ్ లకు మాత్రమే ఆదరణ ఎక్కువగా ఉంటోంది. మిగతా టీమ్ లను అభిమానులు పట్టించుకోవడం లేదు. దీనికి కారణమేంటో ఓసారి చూద్దాం..
చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లకు మాత్రమే ఈ సీజన్ లో వ్యూయర్ షిప్ ఎక్కువగా ఉంటోంది. ఈ నాలుగు జట్ల మ్యాచ్ లకు స్టేడియాలు నిండుతున్నాయి. టీవీలతో పాటు డిజిటల్ స్ట్రీమింగ్ వ్యూస్ కూడా వేరే లెవల్ లో ఉంటున్నాయి. మిగతా మ్యాచ్ లను పెద్దగా పట్టించుకోవడం లేదు. చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడుతున్నాయంటే అర్ధరాత్రి మ్యాచ్ ముగిసే వరకు టీవీలు, సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు.
దీనికి కారణమేంటంటే.. సీఎస్ కే లో ఎంఎస్ ధోని లాంటి లెజెండరీ ప్లేయర్ ఉన్నాడు. డిఫెండింగ్ చాంపియన్ అయిన ఆ టీమ్ కు హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో ఈ జట్టు మ్యాచ్ అంటేనే ఎక్కడలేని ఎగ్జాయిటింగ్ క్రియేట్ అవుతోంది. ఇక ఒక్క కప్ నెగ్గకున్నా ఆర్సీబీ లో విరాట్ కోహ్లీ ఉండడంతో వేరే లెవల్ క్రేజ్ ఉంటోంది. కప్ గెలిచినా గెలవకున్నా ఆర్సీబీ ఫ్యాన్ బేస్ మాములుగా ఉండదు. ఇక ముంబై ఇండియన్స్ కు హిట్ మ్యాన్ ఉండడం పెద్ద బలం. ఐదు సార్లు కప్ అందుకున్న టీమ్ కావడంతో ఎంఐకి ఫ్యాన్ బేస్ ఎక్కువే. ఇక రోహిత్-పాండ్యా కెప్టెన్సీ వివాదం ఉండడం కూడా వ్యూస్ లు బాగా రావడానికి కారణమవుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ఐపీఎల్ లో డేంజరస్ టీంగా మారింది. జట్టులోని బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతుండడంతో ఈ జట్టు మ్యాచ్ లు చూడడానికి జనాలు ఎగబడుతున్నారు. ఈ జట్లలో టాప్ ప్లేయర్స్ ఉండడం.. మిగతా జట్లలో అంత బాగా పేరున్న ప్లేయర్స్ లేకపోవడం కూడా ప్రధాన కారణమని చెప్పవచ్చు.