Modi : గత వారం రోజులుగా భారత్ లో మాల్దీవ్స్ ఘటన హాట్ టాపిక్ గా నిలిచింది. 140 కోట్ల జనాభా ఉన్న భారత దేశ ప్రధాని మోదీ తలుచుకుంటే ఏదైనా చేయగలరని నిరూపితమైన ఘటన అది. మోదీ ఏం చేసినా అందులో పెద్ద వ్యూహమే ఉంటుంది. దాని వెనక భారత ప్రయోజనాలు స్పష్టంగా ఉంటాయి. తాజాగా ఆయన లక్షద్వీప్ లో పర్యటించి ఫొటోలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వాటి కింద మాల్దీవ్స్ మంత్రులు కొందరు ప్రధాని మోదీని, భారత్ ను, లక్షద్వీప్ ను ఉద్దేశించి అభ్యంతరకర కామెంట్స్ పెట్టారు. దీంతో మన దేశం మొత్తం ఆదేశంపై మండిపడింది. ‘‘బాయ్ కాట్ మాల్దీవ్స్’’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. దీంతో మాల్దీవ్స్ కు వెళ్లే భారత టూరిస్టులు తమ ట్రిప్పులను క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పుడు అక్కడి నేతలు తమ తప్పు తెలుసుకుని బతిమాలుకుంటున్నారు. అయితే దీని నేపథ్యం ఏంటో ఒకసారి చూద్దాం..
మొన్న అక్కడ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మొహమ్మద్ మొయిజు చైనా అనుకూలవాది. ఇతడికి భారత్ అంటే సుతారమూ ఇష్టముండదు. అంతే కదా కొందరు మంచి చేసేవారికంటే నిండా ముంచే వారిని ఎక్కువగా నమ్ముతారు. మేక కసాయి వాడిని నమ్మినట్టుగా. ఇక మొయిజు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత చైనాకు అనుకూలంగా.. ఇండియాకు వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. అరే బుల్లిదేశం.. పాపం సాయం చేద్దామని భారత్ అనుకుంటుంటే.. వారే ఏకు మేకు అవుతున్నారు. వాస్తవానికి మన టూరిస్టులు వెళ్తేనే ఆ దేశానికి ఆదాయం. లేకుంటే అక్కడ అన్నీ ఇసుక దిబ్బలు మాత్రమే. అయినా కూడా మనదేశంపై ఈమధ్య అవాకులు చెవాకులు పేలుతోంది.
మనపైకి తొడలు కొడుతున్న మాల్దీవ్స్ కు గట్టిగానే బుద్ధి చెప్పాలని మోదీ భావించారు. ఆ దేశ ప్రధాన ఆదాయ వనరు అయిన టూరిజంపైనే దెబ్బ కొట్టాలని భావించారు. మన దేశంలోని లక్షద్వీప్ లో ఆయన రీసెంట్ గా పర్యటించారు. ఇక్కడా ఎన్నో అందమైన బీచ్ లు, ప్రాంతాలు ఉన్నాయని దేశ టూరిస్టులు అందరూ లక్షద్వీప్ లో పర్యటించాలని పిలుపునిచ్చారు. దీంతో లక్షద్వీప్ కు ఎక్కడలేని ప్రాధాన్యం లభించింది. పలువురు ప్రముఖులు కూడా తాము లక్షద్వీప్ కు వెళ్తామని, మాల్దీవులకు వెళ్లమని ప్రకటనలు చేశారు.
దీంతో గాబరా పడిన మాల్దీవ్స్ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు మోదీపై, భారత్ పై నానా కూతలు కూశారు. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం చేసింది. దేశంలో ‘బాయ్ కాట్ మాల్దీవ్స్’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. దీంతో దెబ్బకు మాల్దీవ్స్ ట్రిప్స్ భారీగా పడిపోయాయి. ఫ్లైట్ టికెట్స్ డ్రాప్ అయిపోయాయి. ఇక ఆదేశానికి వణుకు మొదలైంది. తమ మంత్రులు చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదని, అవి వారి వ్యక్తిగతమని, వారిని సస్పెండ్ చేశామని దిద్దుబాబు చర్యలు తీసుకుంటోంది.
ఇక ఆ దేశ అధ్యక్షుడు మొయిజు ఉన్న పళంగా చైనా ట్రిప్ వేశాడు. అక్కడి ప్రజాప్రతినిధులతో వరుసగా భేటి అవుతున్నాడు. నిన్న మాల్దీవుల బిజినెస్ ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘‘తమ దేశానికి విరివిగా టూరిస్టులను పంపాలని’’ బతిమాలుకున్నాడు.
ఇదిలా ఉండగా ప్రధాని మోదీ పిలుపుతో భారత ప్రముఖులు, సెలబ్రిటీలు, టూరిస్టులు.. లక్షద్వీప్ ను తమ టూరిస్టు ప్లేస్ గా ఎంచుకుంటున్నారు. మరో రెండు నెలల దాక లక్షద్వీప్ ఫ్లైట్స్, హోటల్స్ లో వెకెన్సీ లేదట. దీంతో లక్షద్వీప్ కు టూరిస్టులు పెరిగి.. దేశ ఆదాయం పెరుగుతుంది. మన దేశమే కాబట్టి వీసాలు అవసరం లేదు. విదేశీ కరెన్సీ అవసరం లేదు. మన మారక ద్రవ్యం మన దగ్గరే ఉంటుంది. మాల్దీవ్స్ కు దీటుగా లక్షద్వీప్ లో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తే అక్కడి అందాలు దేశంలోని టూరిస్టులు బారులు కడతారు. విదేశాల నుంచి కూడా టూరిస్టుల సంఖ్య పెరుగుతుంది. దీంతో మన దేశం మూడో ఆర్థిక వ్యవస్థగా మారేందుకు టూరిజం ఆదాయం కూడా దోహదపడుతుంది. ఇక మాల్దీవుల్లో టాటా కంపెనీ రెండు పెద్ద హోటల్స్ కూడా నిర్మించబోతోందట.
ఇలా దేశంలోని ప్రముఖ సంస్థలు అక్కడ మౌలిక సదుపాయాలకు సహకారం అందిస్తే మరో నాలుగైదు ఏండ్లలోనే లక్షద్వీప్ పెద్ద టూరిజం స్పాట్ గా మారే అవకాశాలు ఉన్నాయి. సినిమా షూటింగ్ లు, అడ్వెంచర్ గేమ్స్ కోసం, ఎంటర్ టైన్ మెంట్ కోసం వచ్చే టూరిస్టులతో దేశ ఆదాయం బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రధాని మోదీ భవిష్యత్ లో ఇండియా బెస్ట్ టూరిజం కంట్రీగా ఎదగడానికి, అలాగే చైనా వైపు మొగ్గుచూపుతున్న మాల్దీవులకు బుద్ధి చెప్పడానికి లక్షద్వీప్ ను ఎంచుకున్నారు. అది సఫలీకృతమైందనే చెప్పాలి.